Rajya Sabha seats for 100 crore: రూ.100 కోట్లు ఇస్తే రాజ్యసభ సీటు ఇస్తాం లేదా గవర్నర్ పోస్ట్ ఇస్తామంటూ నడుపుతోన్న ఓ దందా గుట్టు రట్టు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). నిందితులకు ఓ వ్యక్తికి మధ్య డబ్బులు చేతులు మారడానికి క్షణాల ముందు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
ఇదీ జరిగింది
నాలుగు వారాలుగా గుర్తు తెలియని నంబర్ల నుంచి వెళ్తున్న కాల్స్‌పై నిఘా వహించారు అధికారులు. ఎట్టకేలకు నలుగురు నిందితులను గుర్తించి పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కర్మలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్గార్, కర్ణాటకకు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, దిల్లీకి చెందిన మహేంద్ర పాల్, అభిషేక్ బూరాలను నిందితులుగా గుర్తించారు అధికారులు.
చాలా కాలంగా
చాలా కాలంగా వీరు ఈ రాకెట్ నడుపుతున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. డబ్బులిస్తే రాజ్యసభ సీటు, గవర్నర్ పదవితో పాటు ప్రభుత్వ సంస్థలకు ఛైర్మన్‌గా నియమిస్తామని వీళ్లు చాలా మందిని నమ్మించి డబ్బులు గుంజుతున్నారు. ఇలా మోసాలు చేస్తోన్న ఈ ముఠాను ఎట్టకేలకు సీబీఐ పట్టుకుంది.
అంతేకాకుండా వీళ్లు సీబీఐ అధికారులమని చెప్పి పోలీసు శాఖలో అధికారులను కూడా బురిడీ కొట్టించి పనులు చేయించుకున్నట్లు సమాచారం. నిందితుడు ప్రేమ్‌కుమార్ తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని చెప్పి అభిషేక్ బూరాతో కలిసి కుట్రలు చేసినట్లు సీబీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తెలిపింది.
ఇప్పటికే వీరి చేతిలో ఎంతోమంది వీఐపీలు కూడా మోసపోయినట్లు తెలుస్తోంది. వీరిని ఎలాగైనా పట్టుకోవాలని ప్రయత్నించిన సీబీఐ.. ఫోన్‌కాల్స్ ద్వారా వీరిని కనిపెట్టింది. డబ్బులు మార్పిడి జరుగుతోన్న సమయంలో వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Also Read: Congress MPs Suspended: నలుగురు కాంగ్రెస్ సభ్యులు సస్పెండ్- లోక్‌సభ స్పీకర్ వార్నింగ్!
Also Read: Father Kills Son In Gujarat: ఒళ్లు గగుర్పొడిచే క్రైమ్ కథ- కొడుకును ముక్కలుగా నరికి పారేసిన తండ్రి!