Armymen Killed In Rajouri Shootout : జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం జరిగిన కాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో (Rajouri Encounter) ఇద్దరు కెప్టెన్లు సహా మొత్తం నలుగురు సైనికులు కన్నుమూశారని అధికారులు తెలిపారు. ఏఎన్ఐ రిపోర్ట్ ప్రకారం.. రాజౌరీ జిల్లాలోని బాజిమాల్‌ అడవుల్లో ఉగ్రవాదుల కదలికలు గుర్తించారు. 


నిఘా వర్గాల సమచారంతో భద్రతా దళాలు, కశ్మీర్ పోలీసులు బాజిమాల్‌ అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆర్మీ జవాన్లపై కాల్పులు జరిపారు. ధర్మాల్‌లోని బాజిమాల్ ప్రాంతంలో ఉగ్రవాదుల కాల్పులకు స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. కానీ ఈ కాల్పుల్లో ఇద్దరు కెప్టెన్లు, మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరికొందరు జవాన్లు, సిబ్బంది గాయపడగా.. చికిత్స అందించేందుకు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారని ఓ ఉన్నతాధికారి తెలిపారు.  






బాజిమాల్‌ అటవీ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల కదలికల్ని అధికారులు గుర్తించారు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారేమోనని నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో ఆర్మీ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహించగా.. జవాన్లు కనిపించగానే ఉగ్రవాదులు వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు ఎదురుకాల్పులు జరిపినా ప్రయోజనం లేకపోయింది. నలుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని రోజులుగా అక్కడ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ లో ఏడాది కాలంలో 121 మంది చనిపోయారు. ఇందులో 27 మంది భద్రతా సిబ్బంది ఉండగా, 81 మంది ముష్కరులు హతమయ్యారు. అత్యధికంగా రాజౌరి జిల్లాలోనే 47 మంది చనిపోయినట్లు సమాచారం.