Father Murdered Son:
కొడుకుని చంపిన తండ్రి
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ (World Cup Final Match) దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపి ఉసూరుమనిపించింది. 10 మ్యాచ్‌లు వరుసగా గెలిచిన భారత్ ఫైనల్‌లోనూ గెలుస్తుందని అంతా ధీమాగా ఉన్నారు. కానీ ఆసిస్ కప్ సాధించింది. ఇది క్రికెట్ ఫ్యాన్స్‌ని నిరాశకు గురి చేసింది. కొందరు కన్నీళ్లు పెట్టుకుంటే ఇంకొందరు టీమిండియాని తిట్టిపోశారు. మరి కొందరైతే మ్యాచ్ జరుగుతుండగానే "ఎలాగో గెలవం కదా" అని టీవీ ఆఫ్ చేశారు. ఇదే ఓ యువకుడి ప్రాణం తీసింది. మ్యాచ్ చూస్తుండగా టీవీ ఆఫ్ చేశాడన్న కోపంతో కొడుకుతో గొడవ పడ్డాడు తండ్రి. ఆ ఆవేశంలో కొడుకుని చంపేశాడు. యూపీలోని కాన్‌పూర్‌లో జరిగిందీ ఘటన. మ్యాచ్ చూస్తుండగా కొడుకు వచ్చి డిన్నర్ ప్రిపేర్ చేయాలని అడిగాడు. మ్యాచ్ అయ్యాక చూద్దాం అని తండ్రి వారించాడు. అయినా వినకుండా టీవీ ఆఫ్ చేశాడు. ఇద్దరి మధ్య గొడవైంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న తండ్రి కొడుకుపై దాడి చేశాడు. మొబైల్ ఛార్జర్ వైర్‌తో గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తరవాత అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలించారు. కాన్‌పూర్‌లో అరెస్ట్ చేశారు. మెట్లపై యువకుడి డెడ్‌బాడీ పడి ఉండడాన్ని చూసిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. క్రికెట్ మ్యాచ్ కారణంగానే ఈ హత్య జరిగిందని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. ఇందుకోసం మొబైల్ ఛార్జర్ కేబుల్‌ని వినియోగించినట్టు పోలీసులు వెల్లడించారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. మద్యం మత్తులో భార్యనీ కొట్టడం వల్ల గత వారమే ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు కొడుకుపైనా దాడి చేసి చంపేశాడు నిందితుడు.