Rajiv Gandhi Case: 


విడుదలైనా జైల్లోనే..


రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఎమ్‌టీ శంతన్ (MT Santhan) అలియాస్ టి. సుతేందిర రాజ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న శంతన్ శ్రీలంక వాసి. స్పెషల్‌ క్యాంప్‌లో ఫ్రీ ప్రిజనర్‌గా ఉండడం కన్నా సెంట్రల్‌ జైల్‌లో జీవిత ఖైదు అనుభవించడమే నయమని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఇంటికి పంపాలని ప్రధానికి విజ్ఞప్తి చేసుకున్నాడు. గతేడాది నవంబర్ 11న సుప్రీంకోర్టు రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురిని విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే...నళిని, శ్రీహరన్, శంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్ విడుదలయ్యారు. దాదాపు 32 ఏళ్ల తరవాత జైలు నుంచి బయటకు వచ్చారు వీళ్లంతా. అయితే...ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. నళిని, రవిచంద్రన్‌ను ఫ్రీగా వదిలేసిన సుప్రీంకోర్టు...తమ కుటుంబ సభ్యుల్ని కలిసేందుకూ అవకాశమిచ్చింది. కానీ...మిగతా నలుగురిని మాత్రం తిరుచ్చిలోని సెంట్రల్ జైల్‌లో ఫ్రీ ప్రిజనర్లుగా ఉంచింది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ నలుగురూ శ్రీలంకకు చెందిన వాళ్లు. ఆ దేశంతో సంప్రదింపులు జరిపి అక్కడికి పంపేయాలని భావిస్తోంది భారత్. ఈ విషయంలో రెండు దేశాల మధ్య ఇంకా ఓ నిర్ణయం కుదరలేదు. ఫలితంగా...నలుగురూ ఇంకా జైల్‌లోనే ఉండాల్సి వస్తోంది. దీనిపైనే అసహనం వ్యక్తం చేస్తున్నాడు శంతన్. ఇంటికి వెళ్లాలనుంది అంటూ వేడుకుంటున్నాడు. 


"ప్రధాని నరేంద్ర మోదీ, జైశంకర్‌కి లేఖ రాశాను. శ్రీలంక డిప్యుటీ హై కమిషన్ ఆఫీస్‌కి వెళ్లేందుకు అనుమతినివ్వాలని కోరాను. అక్కడికి వెళ్తే నా పాస్‌పోర్ట్‌ రెన్యువల్ చేసుకోడానికి వీలవుతుంది. ఇప్పటి వరకూ నాకు ఎలాంటి రిప్లై రాలేదు. నేను మా అమ్మను చూసి 32 ఏళ్లు అవుతోంది. ఈ వయసులో ఆమెకు తోడుగా లేనందుకు నాకెంతో బాధగా ఉంది. అధికారులు మమ్మల్ని ఉరి తీయకుండా ఉంచారు. కానీ నాకు బతికున్నట్టు అనిపించడం లేదు. దాదాపు ఆర్నెల్లుగా ఇక్కడే ఉండిపోయాను. అంతా చీకటే ఉంది. కనీసం ఈ గదిలో కిటికీలు కూడా లేవు. సూర్యుడిని చూసి చాలా రోజులైపోయింది. ఫోన్‌లో మాట్లాడేందుకు కూడా అనుమతినివ్వడం లేదు. కేవలం రక్త సంబంధీకులే వచ్చి మాట్లాడాలని ఆంక్షలు పెట్టారు. ఇండియాలో నాకు తెలిసిన వాళ్లెవరూ లేరు. ఇక నాకోసం ఎవరొస్తారు..?"


- శంతన్, రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి 


ఈ హత్య కేసులో మొత్తం ఏడుగురు దోషులకు శిక్ష పడగా...అందులో ఒకరైన పెరరివలన్‌ను గతేడాది మేలో విడుదల చేశారు. ఏ ఆధారంగా అయితే...ఈ దోషిని విడుదల చేశారో అదే ఆధారంగా మిగతా ఆరుగురిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో మొత్తం ఏడుగురు దోషులుగా ఉన్నారు. నళిని శ్రీహరన్, మురుగన్, శంతన్, ఏజీ పెరరివలన్‌, జయకుమార్, రాబర్ట్ పయాస్, పీ రవిచంద్రన్‌కు శిక్ష పడింది. వీరిలో ఒకరిని విడుదల చేయగా...మిగతా ఆరుగురు తమిళనాడులోని జైల్లో శిక్ష అనుభవిస్తూ వస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల కారాగార శిక్ష వీళ్లకు విధించారు. ఇన్నాళ్లకు వాళ్లకు విముక్తి లభించింది. 


Also Read: ప్రియురాలిని హత్య చేసిన యువకుడు, డెడ్‌బాడీని ట్యాంక్‌లో దాచి మిస్సింగ్ అంటూ డ్రామా