Rajinikanth: సూపర్ స్టార్ రజినీ కాంత్ తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. కోట్ల మంది అభిమానులు కలిగి, సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతూ రజినీ కాంత్ ఎంత సింపుల్ గా ఉంటారో చాలా మందికి తెలిసిందే. ఆయన వ్యక్తిత్వానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ స్టార్ డమ్, కోట్లకు అధిపతి అయినప్పటికీ ఆయన చాలా సింపుల్ గా ఉండేందుకే ఇష్టపడతారు. ఎక్కడికి వెళ్లినా పెద్దగా హడావుడి లేకుండా సామాన్యుడిలా ఉండటానికే ప్రయత్నిస్తారు. అందుకే ఆయన అంటే అభిమానులకు చచ్చేంత ఇష్టం. అలాంటి రజినీ కాంత్ తన సింప్లిసిటిని మరోసారి చాటుకున్నారు.
సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ జైలర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ఆ మూవీ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు రజినీ కాంత్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దేశవ్యాప్తంగా అలరిస్తోంది. ఈ క్రమంలోనే రజినీ కాంత్ బెంగళూరుకు వెళ్లారు. బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ డిపోను రజినీ సందర్శించారు. రజినీ కాంత్ సినిమాల్లోకి రాకముందు ఇదే డిపోలో కండక్టర్ గా పని చేశారు. ఆ సమయంలోనే తన మిత్రుడి ప్రోత్సాహంతో సినిమా ప్రయత్నాలు ప్రారంభించారు. సినీ ఫీల్డ్ లో అవకాశాల కోసం చాలానే ప్రయత్నించారు. మొదట్లో ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. అందివచ్చిన ఒక్కో అవకాశంతో తనేంటో నిరూపించుకున్నారు. అలా భాషాభేదం లేకుండా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కోట్లాధిపతి కూడా అయ్యారు. అలాంటి సూపర్ స్టార్ గతంలో తాను పని చేసిన చోటుకు రావడంతో అక్కడి సిబ్బంది ఉబ్బితబ్బిబ్బయ్యారు.
మంగళవారం ఉదయం 11.30 గంటలకు బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ డిపోకు చేరుకున్నారు. ఆయన రాక పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. 11.45 వరకు రజినీ కాంత్ బీఎంటీసీ డిపోలోనే ఉన్నారు. అక్కడి సిబ్బంది కలిసి మాట్లాడారు. డిపో మేనేజర్ తో పాటు మెకానిక్ సిబ్బంది, కార్మికులు, బస్ డ్రైవర్లు, కండక్టర్లను పలకరించారు. కాసేపు ఆ డిపోలో కలియ తిరిగారు. గతంలో అక్కడ ఆయన తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత సిబ్బందితో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు. సిబ్బంది తనతో సెల్ఫీలు తీసుకుంటే ఎవరినీ వారించకుండా వారికి సహకరించారు. రజినీ కాంత్ ఈ సర్‌ప్రైజ్ కార్యక్రమంతో డిపో సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు. రజినీ కాంత్ డిపోకు వచ్చినప్పుడు ఆయన చిన్ననాటి స్నేహితుడు రాజ్ బహదూర్ కూడా రజినీతో ఉన్నారు.
Also Read: Aditya-L1: సూర్యుడిపై నిఘా కోసమే ఆదిత్య-ఎల్1, మానవాళికి ముప్పు తప్పించేందుకేనంటున్న ఇస్రో!