రాజస్థాన్ ఝున్ఝునూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ జీపు, రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ ట్రాక్టర్ ట్రాలీపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
దర్శనానికి
ఝున్ఝునూ- గుఢా రోడ్ హైవే వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఓ ఆలయ దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ప్రధాని దిగ్భ్రాంతి
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటంబాలకు రూ.2 లక్షలు, గాయాలైన వారికి చెరో రూ.50 వేల సాయం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.
సీఎం విచారం
ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం వారికి మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.