Rajasthan Election Results:
రాజస్థాన్‌లో బీజేపీ హవా..
రాజస్థాన్‌లో రెండోసారి అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ ఆశలు (Rajasthan Election Results) అడియాసలే అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలనూ తలదన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్పిన కాంగ్రెస్ డీలా పడిపోయింది. బీజేపీ ఘన విజయం సాధించింది. 115 స్థానాలు గెలుచుకుంది. గహ్లోట్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఫలితాల రూపంలో కనిపించింది. కాంగ్రెస్ 69 స్థానాలకు పరిమితమైంది. అంతర్గత విభేదాలు, అవినీతి ఆరోపణలు, శాంతి భద్రతల్లో సమస్యలు లాంటి అంశాలు కాంగ్రెస్‌ని దెబ్బ తీశాయి. రెడ్ డైరీ వివాదమూ బీజేపీకి అస్త్రంగా మారింది. సరిగ్గా ఎన్నికల ముందే ఈడీ సోదాలు నిర్వహించడమూ ఫలితాలపై ప్రభావం చూపించింది. ప్రతి ఐదేళ్లకోసారి అధికారం మారిపోవడం రాజస్థాన్‌లో ట్రెండ్. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..ఈ సారి ఆ అవకాశాన్ని బీజేపీకి ఇచ్చారు ఓటర్లు. 2018లో వసుంధర రాజే ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అశోక్ గహ్లోట్‌కి హైకమాండ్ సీఎం పదవి కట్టబెట్టింది. సచిన్ పైలట్‌కి డిప్యుటీ సీఎం పదవి ఇచ్చింది. అయితే...అంతర్గత విభేదాల కారణంగా 2020లో సచిన్ పైలట్ డిప్యుటీ సీఎం పదవి నుంచి దిగిపోయారు. ఈ ఫలితాలపై అశోక్ గహ్లోట్ స్పందించారు. ఇప్పటికే తన రాజీనామా లేఖని గవర్నర్‌కి అందించారు.
"ఈ ఫలితాలు అసలు ఊహించలేదు. మా ఆలోచనల్ని, హామీల్ని ప్రజల వరకూ తీసుకెళ్లడంలో మేం ఫెయిల్ అయ్యాం. ఈ ఫలితాలతో అది అర్థమైంది. మేం చాలా కష్టపడినా కూడా గెలవలేకపోయాం. అలా అని వేరే ప్రభుత్వం వచ్చినంత మాత్రాన ఎవరూ పని చేయకూడదని కాదు. విజయం సాధించడం కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకీ నా ధన్యవాదాలు"
- అశోక్ గహ్లోట్, రాజస్థాన్ మాజీ సీఎం