Jan Aakrosh Yatra: రాజస్థాన్ లో బీజేపీ నేతలు చేపట్టిన జన్ ఆక్రోశ్ యాత్రను కరోనా కారణంగా రద్దు చేసినట్లు తెలిపిన నాయకులు గంటల వ్యవధిలోనే నిర్ణయాన్ని మార్చుకున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ యాత్రను షెడ్యూల్ ప్రకారం కొనసాగించనున్నట్లు తెలిపారు. రాజస్థాన్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో డిసెంబర్ 1వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ యాత్రను ప్రారంభించారు. రైతుల, పాలనా పరమైన సమస్యలపై కాంగ్రెస్ నేతృత్వంలోని అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు జన్ ఆక్రోశ్ పేరుతో సభలు నిర్వహిస్తోంది. 


తాజాగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున యాత్రను రద్దు చేసుకుంటున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ గురువారం తెలిపారు. బీజేపీకి ప్రజలే ముఖ్యం అని, ఆ తర్వాతే రాజకీయాలు.. ప్రజల భద్రత వారి ఆరోగ్యమే తమ ప్రాధాన్యం అని వివరించారు. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పునియా మాట్లాడుతూ యాత్రను రద్దే చేయట్లేదని వెల్లడించారు. ఇప్పటి వరకు 41 అసెంబ్లీ నియోజక వర్గాల్లో జన్ ఆక్రోశ్ సభలను నిర్వహించామని, అయితే కోరనా కారణంగా దానిపై ముందు కొంత గందరగోళం నెలకొందని తెలిపారు. కానీ యాత్ర రద్దు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని అన్నారు. అందుకే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జన్ ఆక్రోశ్ సభలను నిర్వహించుకున్నట్లు వెల్లడించారు. ఈ సభల్లో కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అడ్వైజరీలు వచ్చే వరకు యాత్ర కొనసాగుతుందని అన్నారు. 


రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై లేఖ


కరోనా విజృంభిస్తున్న వేళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ యాత్రలో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఇటీవల రాహుల్ గాంధీకి లేఖ పంపారు. యాత్రలో కరోనా నిబంధలు పాటించాలని, లేని పక్షంలో భారత్ జోడో యాత్రను రద్దు చేయాలని కోరారు. ఈ లేఖపై రాహుల్ గాంధీ స్పందించారు. జోడో యాత్రను ఆపడానికి మోదీ సర్కార్‌ సాకులు వెతుకుతుందని రాహుల్ కౌంటర్ ఇచ్చారు.



ఇది వారి (బీజేపీ) కొత్త ఐడియా. 'కొవిడ్ వస్తోంది.. యాత్రను ఆపండి' అని వారు నాకు లేఖ రాశారు. ఈ యాత్రను ఆపడానికి ఇవన్నీ వారు చెప్పే సాకులు. వాళ్లు.. భారత్‌ చెప్పే సత్యానికి భయపడుతున్నారు. " -రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత


అలాగే ఇటీవల గుజరాత్‌ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ భారీ రోడ్‌ షోను ప్రస్తావిస్తూ ఆ సమయంలో నిబంధనలు గుర్తుకు రాలేదా అంటూ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీ చేపడుతున్న ర్యాలీపై కమలం పార్టీ నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.