National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణ వరుసగా రెండోరోజు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం.
ఈ రోజు ఉదయం 11.05 గంటలకు తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి రాహుల్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు 4 గంటలకు పైగా అధికారులు విచారణ జరిపారు. వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు ఆయనకు దాదాపు గంట పాటు బ్రేక్ ఇచ్చారు.
బ్రేక్ తర్వాత
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం నుంచి మధ్యాహ్నం 3.45 గంటల సమయంలో లంచ్ కోసం రాహుల్ గాంధీ బయటకు వచ్చారు. లంచ్ బ్రేక్ ముగిసిన అనంతరం సాయంత్రం 4.45 గంటల సమయంలో తిరిగి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
సోమవారం దాదాపు పది గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారించారు. ఈరోజు ఉదయం తొలుత కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న రాహుల్ అక్కడి నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణకు హాజరయ్యారు.
పార్టీ నిరసనలు
రాహుల్ గాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ రెండో రోజు కూడా కాంగ్రెస్ శ్రేణులు దిల్లీలో నిరసనలు తెలిపాయి. జన్‌పథ్ వద్ద నిరసన తెలిపిన ఆ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌధురి, గౌరవ్ గగొయ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని బాదార్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇదీ కేసు
కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.
ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా తదితరులు ఉన్నారు. ూ
Also Read: Viral Video: 'నాన్నా పులులే గుంపుగా వస్తాయ్- నేను సింగిల్‌గా వస్తా', ఈ షాకింగ్ వీడియో చూశారా?
Also Read: Agneepath Recruitment Scheme: యువతకు రక్షణ శాఖ బంపర్ ఆఫర్- దేశానికి సేవచేయాలంటే రండి!