ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చివరి రోజు రమేష్ బిధూరి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు డానీష్ అలీని టెర్రరిస్టు అంటూ సంబోధించారు. ఎంపీ రమేశ్ బిధూరీ సిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. లోక్‌సభలో ఆయన చేసిన వ్యాఖ్యలను విపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. బీజేపీ ఎంపీని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా...రమేశ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు కాషాయ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
మరోవైపు బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖండించారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని కలిశారు. ఆయనను రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్నారు. డానీష్ అలీతో కలిసి ఉన్న ఫోటోలను రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఫోటోలకు విద్వేష మార్కెట్లో ప్రేమదుకాణం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. రాహుల్ వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్‌ఘరి ఉన్నారు. లోక్‌సభలో కమలం పార్టీ ఎంపీ రమేశ్ బిధూరి వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. ఇలాంటి చిల్లర ప్రవర్తన సభా గౌరవానికి మచ్చ తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఇలాంటి ద్వేష పూరిత మాటలు, విద్వేషపూరిత మనస్తత్వానికి...కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని రాహుల్ ట్వీట్ చేశారు.
రాహుల్‌ను కలిసిన సమయంలో డానీష్ అలీ భావోద్వేగానికి గురయ్యారు. రాహుల్ గాంధీ చూపించిన ప్రేమతో తనకు ఉపశమనం లభించిందన్నారు. తాను ఒంటరిని కాదని, తనకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకే రాహుల్ వచ్చారని తెలిపారు. పార్లమెంట్ లో జరిగిన ఘటనను మనసులో పెట్టుకొని బాధపడవద్దని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని రాహుల్ గాంధీ చెప్పారని డానీష్ వెల్లడించారు. లోక్‌సభలో జరిగిన ఘటన ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. వీధుల్లో విద్వేషాల దుకాణాలు, అమృత కాలంలో కొత్త పార్లమెంట్‌లో ఏర్పాటు చేయడం శోచనీయమని అన్నారు.
పార్లమెంట్ లో ఏం జరిగిందంటే
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ పై చర్చ జరిగింది. బీజేపీ ఎంపీ రమేష్ బిధూరీ, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని అభ్యంతరకర పదజాలంతో దూషించారు. పార్లమెంట్ కొత్త భవనం ఇలాంటి మాటలతో ప్రారంభం కావడం బాధాకరమన్నారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్. బిధూరీ వ్యాఖ్యలు కాషాయ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తోందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓబీసీలను, ముస్లింలను అవమానించడం బీజేపీ సంస్కృతిలో భాగమని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ముస్లిం ఎంపీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఖండించారు. ఎంపీ వ్యాఖ్యల పట్ల స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తనపై చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజీ కమిటీ పరిశీలనకు పంపాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు డానిష్ అలీ లేఖ రాశారు. అభ్యంతరక పదజాలాన్ని వినియోగించడం పట్ల బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలను ఆ తర్వాత రికార్డుల నుంచి తొలగించారు.