National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో 20వ తేదీ వరకూ విచారణకుహ హాజరు కాలేనని ఈడీకి రాహుల్ గాంధీ సమాచారం ఇచ్చారు. తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నందున బాగోగులు చూసుకునేందుకు అనుమతించాలని, విచారణను పొడిగించాలని లేఖలో ఈడీని కోరారు రాహుల్‌ గాంధీ . మూడు రోజులు పాటు మాత్రం ఎనిమిది గంటలకు తక్కువ కాకుండా ప్రశ్నల వర్షం కురిపించింది.  ఈడీ విచారణకు గురువారం బ్రేక్‌ పడింది. తిరిగి శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలంటూ కోరింది ఈడీ. అయితే తాను హాజరు కాలేనని రాహుల్ గాంధీ లేఖ రాశారు. 






ఇదీ కేసు


కాంగ్రెస్ పార్టీ, గాంధీలతో ముడిపడిన నేషనల్ హెరాల్డ్ కేసు ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)ను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐ) తమ అధీనంలోకి తెచ్చుకోవడం వెనుక మోసం, కుట్ర వంటి ఆరోపణలు ఉన్నాయి. 2010లో ఏజేఎల్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి రావడంతో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (వైఐఎల్) కంపెనీ దానిని టేకోవర్ చేసింది. దానికి డైరెక్టర్లుగా ఉన్న సుమన్ దుబే, టెక్నోక్రాట్ శామ్ పిట్రోడాలకు గాంధీ విధేయులుగా పేరుంది.


ఈ కేసుపై సుబ్రహ్మణ్య స్వామి దిల్లీ హైకోర్టులో గతంలో ఫిర్యాదు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కాంగ్రెస్‌ పార్టీకి బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకొనే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్‌ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. ఇందులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ సహా ఏడుగురిని పేర్లను చేర్చారు. వీరిలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా‌ తదితరులు ఉన్నారు.


దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ ఆందోళన


మరో వైపు ఈడీ రాహుల్ గాంధీని వేధిస్తోందంటూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్ ఆందోళనలు చేస్తున్నాయి. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.