సూరత్: పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెయిల్‌ను సూరత్ సెషన్స్ కోర్టు పొడిగించింది. ఈ కేసులో తన శిక్షను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ అప్పీల్ దాఖలు చేయడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 13న వాయిదా వేసింది సూరత్ కోర్టు. 


2019కి సంబంధించిన పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్ష తీర్పుపై మధ్యంతర స్టే విధించాలని అప్పీల్ చేసేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సూరత్ సెషన్స్ కోర్టుకు చేరుకున్నారు. రాహుల్ వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రులు భూపేష్ బఘేల్, సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉన్నారు. భారీ భద్రత నడుమ సూరత్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టుకు చేరుకున్న రాహుల్ గాంధీ తన జైలుశిక్ష తీర్పును సవాల్ చేశారు. 






శిక్ష రద్దు పిటిషన్‌పై మే 3న విచారణ
రాహుల్ గాంధీకి విధించిన జైలుశిక్షపై స్టే పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరగనుంది. కాగా, రాహుల్ గాంధీ 2019లో మోదీ అనే ఇంటి పేరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రెండేళ్ల శిక్ష రద్దుకు సంబంధించిన పిటిషన్‌పై మే 3న సూరత్ సెషన్స్ కోర్టు విచారణ జరపనుంది.- అయితే బెయిల్ పొడిగింపు, శిక్షను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. శిక్ష రద్దు పిటిషన్ మే 3న విచారణకు రానుంది. 


పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి గత నెలలో సూరత్ ట్రయల్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం.. రాహుల్ లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు కూడా పడింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి బస్సులో ప్రయాణం చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో కోర్టు ఆవరణకు చేరుకున్నారు.


కోర్టుపై కాంగ్రెస్ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది: బీజేపీ నేతలు ఫైర్
తీర్పులు చెప్పి బాధితులకు న్యాయం చేసే కోర్టులపై సైతం కాంగ్రెస్ నేతలు ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు.


కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మాట్లాడుతూ.. ఇది అంతా కాంగ్రెస్ నేతల డ్రామా అన్నారు. ‘కాంగ్రెస్ నేతలు న్యాయవ్యవస్థను బెదిరించడానికి నాటకాలు వేస్తున్నారు. వారి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. కోర్టు ఎవరినైనా దోషిగా నిర్ధారిస్తే.. కోర్టులపై తేవడం సరికాదన్నారు. దేశం కంటే తమది ఉన్నతమైన కుటుంబం అని రాహుల్ గాంధీ ఫ్యామిలీ భావిస్తోందని’ వ్యాఖ్యానించారు.


కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ‘వెనుకబడిన వారిని అవమానిస్తే భారతదేశం సహించదు.. గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, పి చిదంబరం, డీకే శివకుమార్‌లు కూడా జైలుకు వెళ్లారని, వారితో పాటు చాలా మంది కాంగ్రెస్‌ నేతలు జైలుకు వెళ్లారని, దేశం కంటే ఒక్క కుటుంబం పెద్దదా?’ అని ఠాకూర్ ప్రశ్నించారు.