CBI’s diamond jubilee event: దేశంలో ప్రజాస్వామ్యానికి, న్యాయానికి అవినీతి అతిపెద్ద ఆటంకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అవినీతి బారి నుంచి దేశాన్ని విముక్తి చేయడం సీబీఐ కీలక బాధ్యత అని సూచించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వజ్రోత్సవ వేడుకలను ప్రధాని సోమవారం ప్రారంభించారు. షిల్లాంగ్, పూణే, నాగ్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన సీబీఐ కార్యాలయ సముదాయాలను ఆయన ప్రారంభించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ట్విట్టర్ ఖాతాను కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. సీబీఐని న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణించారు.
ప్రజల్లో సీబీఐపై అపార విశ్వాసం
సీబీఐ వజ్రోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సీబీఐ తన పనితనం, సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు విశ్వాసం కల్పించిందని తెలిపారు. నేటికీ, ఒక కేసు అపరిష్కృతంగా ఉన్నప్పుడు, దానిని సీబీఐ అప్పగించాలని డిమాండ్లు వినిపిస్తాయని గుర్తుచేశారు. వృత్తిపరమైన, సమర్థవంతమైన సంస్థలు లేకుండా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యం కాదని.. ఈ క్రమంలో సీబీఐపై గురుతర బాధ్యత ఉందని మోదీ స్పష్టంచేశారు.
మల్టీ డైమెన్షనల్-మల్టీ డిసిప్లినరీ
సీబీఐ ఒక బహుముఖమైన, బహుళ విభాగాల దర్యాప్తు సంస్థగా తన ఇమేజ్‌ను నిర్మించుకుందని ప్రధాని ప్రశంసించారు. బ్యాంకు మోసాల నుంచి వన్యప్రాణులకు సంబంధించిన నేరాల వరకు, సీబీఐ పరిధి చాలా విస్తరించిందని ఆయన తెలిపారు.
నల్లధనంపై చర్యలు
నల్లధనం, బినామీ ఆస్తులపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రధాని చెప్పారు. “మేము ఇప్పటికే మిషన్ మోడ్‌లో నల్లధనం, బినామీ ఆస్తులపై చర్యలు ప్రారంభించాం. అవినీతిపరులతో పాటు అవినీతి కారణాలపై కూడా పోరాడుతున్నాం. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అవినీతికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో మా ప్రభుత్వం వెనకడుగు వేయదు’’ అని మోదీ అన్నారు.
సైబర్ నేరాల నియంత్రణకు వినూత్న మార్గాలు
నేడు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత కారణంగా నేరాలు ప్రపంచవ్యాప్తమవుతున్నాయన్నది నిజమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే ఈ సమస్యలకు పరిష్కారం చూపుతుందన్న కూడా నిజమని... అందువల్ల పరిశోధనలలో ఫోరెన్సిక్ సైన్స్ వినియోగాన్ని మనం మరింత పెంచాలని సూచించారు. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి మనం వినూత్న మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. టెక్-ఎనేబుల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ,యువకులు ఇందులో గొప్ప పాత్ర పోషించాలని ప్రధాని అభిలషించారు.
వ్యవస్థపై ప్రజా విశ్వాసమే ప్రధాన లక్ష్యం
అవినీతిపరులు ఎవరైనా, వారు ఎంత పెద్ద స్థానంలో ఉన్నా విడిచిపెట్టకూడదని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు. “దేశంలో అవిశ్వాసం, విధానపరమైన పక్షపాతం ఉన్న సమయాలు ఉన్నాయి. కానీ 2014 నుంచి, వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పునరుద్ధరించడం, పెంపొందించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా మేము పని చేస్తున్నాం అని తెలిపారు. 10 ఏళ్ల క్రితం అవినీతికి పాల్పడేందుకు పోటీ ఉండేదని.. ఆ సమయంలో పెద్దపెద్ద కుంభకోణాలు జరిగాయని ప్రధానమంత్రి అన్నారు. అయితే వ్యవస్థలు వారికి అనుకూలంగా ఉండటంతో నిందితులు భయపడేవారుకాదని చెప్పారు.
తమ ప్రభుత్వం నల్లధనం, బినామీ ఆస్తులపై యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించిందని.. దీంతో పాటు అవినీతికి దారితీసే పరిస్థితులపై పోరాడుతోందని వెల్లడించారు. మీరు శక్తిమంతమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సీబీఐని ఉద్దేశించి పేర్కొన్న ప్రధానమంత్రి.. నిందితులుగా ఉన్న వారు ఏళ్ల తరబడి వ్యవస్థలో ఉన్నారని, ఇప్పటికీ వారు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారని తెలిపారు. అయినా వెనక్కి తగ్గకుండా మీరు మీ పనిపై మాత్రమే దృష్టిపెట్టండి.. అవినీతిపరుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదలొద్దు అంటూ ప్రధాని సీబీఐ అధికారులకు సూచించారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏప్రిల్ 1, 1963న హోం మంత్రిత్వ శాఖ తీర్మానం ద్వారా ఏర్పాటైంది. ఈ దర్యాప్తు సంస్థ శనివారంతో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లో ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ సందర్భంగా సీబీఐ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టింది.