YSRCP MLAs :    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ గడప గడపకూ  మన ప్రభుత్వం సమీక్షా సమవేశానికి పది మందికిపైగా ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. ఇప్పటిేక నలుగురు పార్టీకి దూరం కాగా మిగిలిన వారిలో పది మందికిపైగా సమాచారం లేకుండా డుమ్మా కొట్టడం వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. మంత్రి బుగ్గన  రాజేంద్రనాథ్ రెడ్డి తనకు కరోనా పాజిటివ్ వచ్చినందున హాజరు కావడం లేదని సమాచారం పంపారు. మిగతా ఎవరూ ముందస్తు సమాచారం ఇవ్వలేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. వీరిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు ఉన్నారు. సీఎం జగన్ ఈ సమీక్షా సమావేశాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై అందరకీ దిశానిర్దేశం చేయాలనుకున్నారు. అయితే ఇలా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం వైసీపీ పెద్దలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. 


ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్‌సీపీలో ఒక్క సారిగా అలజడి రేగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో నలుగురు క్రాస్ ఓటింగ్ చేయడమే కాకుండా ఇంకా నలభై మందికిపైగా ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వాలంటీర్లకు ఉన్నంత గౌరవం కూడా లేదని కనీస అధికారాలు కూడా కరువయ్యాయని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో ఐ ప్యాక్ సిబ్బంది తమ రాజకీయ  భవిష్యత్ ను నిర్ణయించే  శక్తులగా మారడం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను అసహనానికి గురి చేస్తోంది. అసలు పార్టీలో స్వేచ్చ లేదని బాధపడుతూంటే.. తమపై ఐ ప్యాక్ సిబ్బంది స్వారీ చేయడం ఏమిటని వారి వాదన. 


ఐ ప్యాక్ సిబ్బంది ఇస్తున్న ఫీడ్ బ్యాక్‌తోనే ఎమ్మెల్యేల పనితీరును సీఎం జగన్ నిర్ధారిస్తున్నారు. తాము కష్టపడుతున్నప్పటికీ కొంత మంది ఐ ప్యాక్ సిబ్బంది తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని..  తమ పనితీరు తెలుసుకోవడానికి ఎన్నో రకాల సోర్సులు ఉండగా.. ఈ ఐ ప్యాక్ మీద ఆధారపడటం ఏమిటన్న అసహనం ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది.  ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు గీత దాటకుండా చూడటానికి వైఎస్ఆర్‌సీపీ పెద్దలు ప్రత్యేకమైన వ్యూహం అవలంభిస్తున్నరు. కఠినమైన నిర్ణయాలు ఏమీ ఉండవని .. సమీక్షకు ముందే మాజీ మంత్రి పేర్ని నాని మీడియా ముందు ప్రకటించారు. అయినప్పటికీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. 


గైర్హాజర్ అయిన ఎమ్మెల్యేలపై వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ప్రత్యేక  దృష్టి పెట్టే అవకాశం ఉంది. వారు నిజంగా అసంతృప్తికి గురై ఉంటే.. కారణాలేమిటో కనుక్కుని పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి. గైర్హజర్ అయిన వారిలో దాదాపుగా ఐదారుగురుకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఉండవని ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వారికి భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చే చాన్స్ ఉందంటున్నారు. విచిత్రంగా వైసీపీలో సీఎం జగన్ అత్యంత సన్నిహితంగా ఉండే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.  


ధర్మాన లాంటి వాళ్లు మాత్రం అసంతృప్త వార్తలను కొట్టిపారేస్తున్నారు. తాము ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని అందుకే సమీక్షకు హాజరుకాలేకపోయామంటున్నారు. ఈ విషయాన్ని ముందే అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లామని చెబుతున్నారు. వారి అనుమతితోనే సమీక్షకు హాజరుకాలేదని అంటున్నారు.