Puri Jagannath Rath Yatra Stampede: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథాయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉదయం జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. శ్రీగండిచ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడినట్టు సమాచారం.
జగన్నాథుడు, బలభద్రుడు, దేవి శుభద్ర విగ్రహాలతో కూడిన మూడు రథాలు జగన్నాథ ఆలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో విహరిస్తున్నాయి. శ్రీ గుండిచా ఆలయం సమీపంలో యాత్ర పునః ప్రారంభమైన టైంలో ఘటన జరిగింది. విపరీతమైన జనం దూసుకురావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.
తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. గుండిచా ఆలయం వద్ద ఉన్న పవిత్ర రథాలను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. రథాలు సమీపిస్తున్న కొద్దీ జనసమూహం మరింతగా పెరిగింది. ఈ క్రమంలో కొందరు కిందపడిపోయారు. ఇలా జరిగిన దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వారంతా స్పాట్‌లోనే చనిపోయారు. ఇందులో ప్రభాతి దాస్, బసంతి సాహు ఇద్దరు మహిళలు ఉన్నారు. 70 ఏళ్ల ప్రేమకాంత్ మొహంతి కూడా చనిపోయాడు. ఈ ముగ్గురూ ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో జనసమూహాన్ని నియంత్రించడానికి పోలీసుల ప్రత్యేక ఏర్పాటు చేశారు. కానీ అవి సరిపోలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో 20 మందికిపైగా గాయపడినట్టు తెలుస్తోంది. వారిని స్థానికంగా చికిత్స అందించారు. తర్వాత వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు.