ఒకటో తారీఖు వస్తుందంటే చాలు. ఏ మార్పులు వస్తాయో, ఏ ఖర్చులు పెరుగుతాయో అని సామాన్యులలో ఆలోచన మొదలవుతుంది. జూలై 1 నుండి పలు ఆర్థిక మార్పులు అమలులోకి రానున్నాయి. ఇవి పన్ను చెల్లింపుదారులు (Tax Payers), బ్యాంక్ కస్టమర్‌లు, క్రెడిట్ కార్డ్ హోల్డర్స్, రైల్వే ప్రయాణీకులపై నేరుగా ప్రభావం చూపుతాయి. పాన్ కార్డ్ దరఖాస్తులలో ఆధార్ ధృవీకరణ నిబంధనల సవరణలు, తత్కాల్ టికెట్ బుకింగ్‌ల నుండి ATM ఛార్జీలు, క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలలో మార్పులు ముఖ్యమైనవి.
పాన్, తత్కాల్ బుకింగ్‌లకు ఆధార్ తప్పనిసరి
డిజిటల్ రూల్స్ మరింత బలోపేతం చేసే దిశగా, జూలై 1 నుంచి కొత్త పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరికీ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి. ఈ విషయాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ప్రకటించింది. ఇప్పటివరకూ చెల్లుబాటు అయ్యే ID, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం వంటి ఇతర గుర్తింపు పత్రాలు ఇచ్చేవారు. కానీ కొత్త నిబంధన ఇప్పుడు ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేసింది.
తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే రైల్వే ప్రయాణీకులు కూడా ఓ మార్పును చూస్తారు. జూలై 1 నుంచి IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా చేసే అన్ని తత్కాల్ బుకింగ్‌లకు ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ అవసరమని రైల్వే శాఖ తెలిపింది. పారదర్శకతను మెరుగుపరచడానికి, టికెటింగ్ ఏజెంట్ల ద్వారా తత్కాల్ కోటాను దుర్వినియోగం చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
నియంత్రణలను మరింత కఠినతరం చేస్తూ, రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 15 నుండి ఆన్‌లైన్‌లో, PRS కౌంటర్లలో లేదా అధీకృత ఏజెంట్ల ద్వారా చేసిన అన్ని తత్కాల్ బుకింగ్‌ల కోసం ఆధార్ ఆధారిత OTP ధృవీకరణను అమలు చేస్తుంది. బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లో రైల్వే ఏజెంట్లు తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేయడానికి వీలు లేదు.
ITR దాఖలు గడువు పొడిగింపు; క్రెడిట్ కార్డ్ నిబంధనలు మారాయి
పన్ను చెల్లింపుదారులకు శుభవార్త, CBDT 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరం కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌లను (ITR) దాఖలు చేయడానికి గడువును పొడిగించింది. జూలై 31 గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. వేతన జీవులకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి అదనంగా 46 రోజులు సమయం ఇస్తుంది. కొత్త గడువుకు దగ్గరగా పోర్టల్ స్లోగా నడుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలను నివారించడానికి ముందుగానే ఫైల్ చేయాలన్నారు.
అనేక ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ నిబంధనలు, సేవా ఛార్జీలలో మార్పులు చేస్తున్నాయి.
SBI కార్డ్ జూలై 15 నుంచి అనేక ప్రీమియం క్రెడిట్ కార్డ్‌లపై ఉచిత ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీని నిలిపివేయనుందని IANS రిపోర్ట్ చేసింది. ఈ కార్డులలో SBI కార్డ్ ELITE, మైల్స్ ELITE, మైల్స్ PRIME ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్డులు రూ. 1 కోటి కవరేజీని అందిస్తున్నాయి. SBI కార్డ్ PRIME, PULSEపై రూ. 50 లక్షల బీమా ప్రయోజనాన్ని సైతం తొలగిస్తారు.
ఈ మార్పులతో పాటు, పెండింగ్‌లో ఉన్న బిల్లులపై కనీస మొత్తం బకాయి (MAD)ని ఎలా లెక్కించాలో SBI కార్డ్ సవరిస్తోంది. జూలై 15 నుంచి MADలో మొత్తం GST మొత్తం, ఏదైనా వర్తించే EMIలు, పూర్తి ఫీజులు, ఫైనాన్స్ ఛార్జీలు, మిగిలిన బ్యాలెన్స్‌లో 2 శాతం కార్డ్ పరిమితిని మించిన మొత్తం ఉంటాయి. ఛార్జీలలో 5 శాతం లేదా ఫైనాన్స్ ఛార్జీలలో 100 శాతం, ఏది ఎక్కువైతే అది పరిగణనలోకి తీసుకుంటారు.
HDFC, ICICI బ్యాంక్ సర్వీస్ ఫీజులు
HDFC బ్యాంక్ కూడా జూలై 1 నుండి అమల్లోకి వచ్చే విధంగా తన ఛార్జీలను మారుస్తోంది. అద్దె చెల్లింపులు, నెలకు రూ. 10,000 మించిన గేమింగ్ ఖర్చులు, రూ. 50,000 కంటే ఎక్కువ యుటిలిటీ బిల్లులతో సహా ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 1 శాతం ఫీజు వర్తిస్తుంది. రూ. 10,000 దాటిన వాలెట్ టాప్-అప్‌లకు ఇదే ఫీజు ఉంటుంది. అయితే, కస్టమర్‌లు ఇప్పుడు బీమా చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు, నెలకు 10,000 పాయింట్లకు పరిమితం చేసింది.
ICICI బ్యాంక్ తన సేవా రుసుము, ATM వినియోగ ఛార్జీలలో సమూల మార్పులను ప్రకటించింది. కస్టమర్‌లు ప్రతి నెలా ICICI బ్యాంక్ ATMలలో ఐదు ఉచిత ATM లావాదేవీలు కొనసాగిస్తారు. ఆ తర్వాత, ఒక్కో లావాదేవీకి ఫీజు రూ. 23 వర్తిస్తుంది. ICICI బ్యాంక్ యేతర ATMల కోసం, మెట్రో నగరాల్లోని వినియోగదారులు నెలకు 3 ఉచిత లావాదేవీలు పొందుతారు, అయితే మెట్రోయేతర ప్రాంతాల్లోని వారు 5 పొందుతారు. లిమిట్ మించి విత్ డ్రాలు చేస్తే ఒక్కో ట్రాన్సాక్షన్ కు రూ. 23 మరియు ఆర్థికేతర లావాదేవీలకు రూ. 8.50 వసూలు చేస్తారు.
అంతర్జాతీయ ATM విత్ డ్రా మరింత ఖరీదు కానుంది. బ్యాంక్ ఒక్కో విత్ డ్రాకు రూ. 125, 3.5 శాతం కరెన్సీ మార్పిడి రుసుము, బ్యాలెన్స్ చెక్‌లు లేదా ఇతర ఆర్థికేతర ఉపయోగాలకు రూ. 25 వసూలు చేస్తుంది. తక్షణ చెల్లింపు సేవా (IMPS) ఫీజులను సవరిస్తున్నారు. లావాదేవీ మొత్తాన్ని బట్టి ఛార్జీలు రూ. 2.50 నుండి రూ. 15 వరకు ఉంటాయి.
ICICI బ్యాంక్ నగదు డిపాజిట్లపై నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. శాఖలు లేదా నగదు రీసైక్లర్ యంత్రాలలో ప్రతి నెలా 3 ఉచిత నగదు లావాదేవీలు మాత్రమే అనుమతిస్తారు. అదనపు డిపాజిట్‌లకు ఒక్కో లావాదేవీకి రూ. 150 ఫీజు వసూలు చేస్తారు. నెలకు రూ. 1 లక్ష కంటే ఎక్కువ డిపాజిట్‌లకు రూ. 150 లేదా రూ. 1,000కి రూ. 3.50 వసూలు చేస్తారు. ఏది ఎక్కువైతే అది. థర్డ్ పార్టీ లావాదేవీలలో ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 25,000 పరిమితిలో ఎటువంటి మార్పు లేదు.