పంజాబ్ లోని ఓ జైల్లో ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ చనిపోవడం కలకలం రేపింది. జైల్లో జరిగిన గ్యాంగ్ వార్ లో ఇద్దరు గ్యాంగ్ స్టర్స్ మన్ దీప్ తుఫాన్, మన్మోహన్ సింగ్ అక్కడిక్కడే మృతి చెందగా, మరో గ్యాంగ్ స్టర్ కేశవ్ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు ఫేమస్ సింగర్ ముసేవాలా హత్య కేసులో నిందితులు అని తెలిసిందే.


అసలేం జరిగిందంటే..
పంజాబ్‌ కాంగ్రెస్ నేత, సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకేసులో నిందితులుగా ఉన్న మన్‌దీప్‌ తుఫాన్‌, మన్మోహన్‌ సింగ్‌, కేశవ్‌ల మధ్య తరణ్ జైల్లో ఆదివారం సాయంత్రం గొడవ జరిగింది. గ్యాంగ్ స్టర్స్ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్లు మన్‌దీప్‌ తూఫాన్‌, మన్మోహన్‌ సింగ్ మృతి చెందగా.. మరో గ్యాంగ్‌స్టర్ కేశవ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పంజాబ్‌లోని తరణ్ జైలులో ఉన్న నిందితుల మధ్య ఘర్షణ ఎందుకు తలెత్తింతి అనే అంశం హాట్ టాపిక్ గా మారింది.


సిద్ధూ ముసేవాలాగా ప్రసిద్ధి చెందిన పంజాబీ గాయకుడు శుభదీప్ సింగ్ సిద్ధూ గత ఏడాది మే 29న పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో దారుణహత్యకు గురయ్యారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సతీందర్‌జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ సిద్ధూ హత్యకు తానే కారణమని అంగీకరించాడు. మూసేవాలాను హత్య చేసిన కేసులో నిందితులైన మన్‌దీప్ తుఫాన్, మన్మోహన్ సింగ్, కేశవ్ లు గోయింద్వాల్ సాహిబ్ జైలులో ఉన్నారు. జైలులో గ్యాంగ్ వార్ జరగడంతో ఇద్దరు నిందితులు చనిపోగా, తీవ్రంగా గాయపడిన కేశవ్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 






షార్ప్ షూటర్ మన్ దీప్..
భగవాన్‌పురియా గ్యాంగ్‌లో మన్‌దీప్ సింగ్ అలియాస్ తుఫాన్ జగ్గు షార్ప్ షూటర్. అతను రాయ్ కి చెందినవాడు. మూసేవాలా హత్య కేసులో భగవాన్‌పూరియాను పోలీసులు విచారించిన తర్వాత మన్ దీప్ తుఫాన్ పేరు తెరపైకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లో పంజాబ్ పోలీసులు మన్ దీప్ తుఫాన్ ను అరెస్ట్ చేశారు. మరో గ్యాంగ్‌స్టర్ రాణా కండోవాలియా హత్య కేసులోనూ మన్‌దీప్ తూఫాన్‌కు నిందితుడిగా ఉన్నాడు. సింగర్ ముసేవాలా హత్య కేసులోనూ ఇతడు నిందితుడు అని పోలీసులు తెలిపారు. 


మన్మోహన్ సింగ్ ఎవరంటే?
తాజాగా జైల్లో ఘర్షణలో మరణించిన రెండో గ్యాంగ్‌స్టర్ మన్మోహన్ సింగ్ మోహనా. మన్మోహన్‌ సింగ్‌పై సైతం సింగర్ సిద్ధూ ముసేవాలా హత్య కేసులో ఆరోపణలు వచ్చాయి. మన్మోహన్ సింగ్ గతంలో అకాలీదళ్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడు. పంజాబ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ మద్దతుదారుడిగా మారిన మన్మోహన్ సింగ్ మాన్సా ప్రాంతానికి చెందినవాడు. గతంలో అతడిపై ఎన్నో క్రిమినల్ కేసులు నమోదు కాగా, బుధ్లాడ ట్రక్ యూనియన్ చీఫ్ దర్శన్ సింగ్ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. ముసేవాలా హత్య కేసులో మరోసారి అరెస్టయ్యాడు.