Sonia Gandhi On Retirement:


తప్పుదోవ పట్టించకండి: కాంగ్రెస్ ప్రతినిధి 


కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ "రిటైర్‌మెంట్‌"పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత్‌ జోడో యాత్రతోనే తన ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు అని వేదికపైనే ప్రకటించారు. సోనియా గాంధీ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండరు అనే నిర్ణయానికి వచ్చేశారంతా. 
మీడియా కూడా దీన్ని హైలైట్ చేసింది. అయితే...ఈ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది కాంగ్రెస్. ఆమె వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టతనిచ్చింది. కాంగ్రెస్ ప్రతినిధి అల్కా లంబా దీనిపై స్పందించారు. సోనియా రాజకీయాల్లో నుంచి తప్పుకోవడం లేదంటూ వెల్లడించారు. ఆమె ప్రసంగాన్ని తప్పుదోవ పట్టించి కథనాలు రాయొద్దంటూ మీడియాకు సూచించారు. 


"ఈ వార్తలు సోనియా గాంధీ వరకూ వెళ్లాయి. ఇది వినగానే సోనియా గాంధీ గట్టిగా నవ్వారు. నేనెప్పుడూ రాజకీయాల నుంచి తప్పుకోలేదు. తప్పుకోను కూడా అని నాతో చాలా స్పష్టంగా చెప్పారు. మీడియా ఇది గమనించాలి. ఆమె ప్రసంగాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు" 


అల్కా లంబా, కాంగ్రెస్ ప్రతినిధి


మరో కాంగ్రెస్ నేత కుమారి సెల్జా కూడా ఈ వార్తలపై స్పందించారు. సోనియా గాంధీ మాటల వెనక ఉద్దేశం వేరని వివరించారు. తాను అధ్యక్ష పదవి రేసులో లేనని సోనియా చెప్పారని తెలిపారు. "ప్రెసిడెంట్ ఇన్నింగ్స్‌ నుంచి తప్పుకుంటున్నానని మాత్రమే సోనియా చెప్పారు. ఆమె రాజకీయాల నుంచి తప్పుకోలేదు" అని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రతోనే తన పొలిటికల్ ఇన్నింగ్స్ ముగుస్తుందని అని వెల్లడించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంతో పురోగతి సాధించిందని, ఆయన పని తీరు తనకు సంతృప్తినిచ్చిందని అన్నారు. 


"2004,2009లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో మేం సాధించిన విజయాలు ఎంతో సంతృప్తినిచ్చాయి. ఇంకా సంతోషించే విషయం ఏంటంటే భారత్ జోడో యాత్రతోనే నా రాజకీయ ఇన్నింగ్స్ ముగుస్తుండొచ్చు. కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు అవుతుండొచ్చు" 


-సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు 


మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అప్పట్లో ప్రభుత్వాన్ని నడిపించిన తీరుని ప్రశంసించారు సోనియా గాంధీ. ప్రజాస్వామ్యాన్ని బలపరిచేందుకు కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోనూ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అని అన్న సోనియా గాంధీ...కాంగ్రెస్ కేవలం పార్టీ మాత్రమే కాదని, ఇక్కడ ప్రజాస్వామ్యానికి తావు ఉందని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.