Nellore News: అధికార బలంతో నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతరను అడ్డుకున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితరులు గ్రామ దేవత ఇరు కళల పరమేశ్వరి అమ్మవారి జాతర జరగకుండా అడ్డుపడ్డారని కోటంరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద  ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి జాతర జరిపించాలని గరికపాటి నరసింహారావు సూచనతో తన సొంత ఖర్చులతో అమ్మవారి జాతర జరిపించాలనుకున్నామని, దేవాదాయ శాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసామని, మౌఖికంగా అనుమతి కూడా జారీ చేశారని వెల్లడించారు.






'అధికారులపై రాజకీయ ఒత్తిడి'


రాత్రికి రాత్రి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి గ్రామ జాతరలో కూడా రాజకీయాలు చేసిన దౌర్భాగ్య పరిస్థితి తీసుకు వచ్చారని కోటం రెడ్డి విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అధికార బలం ఉందని గర్వంతో గ్రామ జాతరను అడ్డుకోవడం ఏం పద్ధతిని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే ప్రశ్నించారు. 






'రెండు చేతులు కట్టేశారు'


తన రెండు చేతులను కట్టివేశారని మూగ చాటింపుకు వచ్చిన వ్యక్తికి కార్యక్రమం రద్దు అయిందని వెళ్లిపోవాలని దేవాదాయ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారన్నారు. రాత్రి నుంచి వాట్సప్ లో దేవాదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి ప్రసాద్ జాతరకు సంబంధించి అనుమతి లేదంటూ పోస్టింగులు పెడుతున్నారని ఆదాల విజయ్ కుమార్ రెడ్డి కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా సాగిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలు చేశారు. 






'అధికార బలానికి తలొగ్గాల్సి వచ్చింది'


ఇక విధిలేని పరిస్థితుల్లో అధికార బలానికి తలొగ్గి వెను తిరుగుతున్నానని ఎమ్మెల్యో తెలిపారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారు తనకు శక్తి ఇస్తే ఇరుకళల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని గ్రామ దేవతలను గౌరవించుకుంటామని తెలిపారు.