NTR District News: తమ వద్ద పని చేసే డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే అతడు తరచుగా వాళ్ల ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. విషయం గుర్తించిన భర్త.. డ్రైవర్ ను మందలించాడు. మరోసారి ఇంటికి రావద్దని చెప్పాడు. అది విన్న భార్య తీవ్ర కోపానికి గురై.. భర్తపై దాడికి దిగింది. ఆమెకు సాయంగా ప్రియుడు కూడా అతడిపై దాడి చేశాడు. విషయం గుర్తించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు శనివారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఎన్టీఆర్ జిల్లాలోని కంచికచర్లలో శుక్రవారం అర్ధరాత్రి ఓ హత్య జరిగింది. నందిగామ రూరల్ సీఐ ఐవీ నాగేంద్ర కుమార్ కథనం మేరకు.. వీరులపాడు మండలం బుజ్జూరు గ్రామానికి చెందిన 47 ఏళ్ల కుంచం రామారావు తన భార్య పిల్లలతో కంచికచర్ల పెద్ద బజారులోని పోస్టాఫీసు రోడ్డులో అద్దెకు ఉంటున్నాడు. రామారావు రేషన్ డీలర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆయన భార్య భార్గవి కంచికచర్ల మండలం మోగలూరు గ్రామ సచివాలయంలో ఏఎన్ఎంగా పని చేస్తుంది. వారికి పిల్లలు లేకపోవడంతో పదేళ్ల క్రితం రామారావు తన తమ్ముడు శ్రీను చిన్న కుమార్తె జోహారికను పెంచుకుంటున్నారు. ఐదేళ్ల తర్వాత భార్గవికి సుస్మిత అనే పాప పుట్టింది. రామారావుకు గతంలో జేసీబీ ఉండేది. దానిపై బెజ్జూరు గ్రామానికి చెందిన మోగులూరు ప్రవీణ్ కుమార్ డ్రైవర్ గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ కు, బార్గవికి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.
అప్పటి నుంచి ప్రవీణ్ కుమార్ తరచుగా రామారావు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి ప్రవీణ్.. రామారావు ఇంటికి రాగా రామారావు అతడిని మందలించాడు. మరోసారి తన ఇంటికి రావొద్దని హెచ్చరించాడు. దీంతో తీవ్ర కోపోద్రేకానికి గురైన భార్గవి భర్తపై దాడి చేసింది. ఆమె ప్రియుడు ప్రవీణ్ కుమార్ కూడా అతడిని కొట్టడం ప్రారంభించారు. ఆ సమయంలోనే ప్రవీణ్ తన స్నేహితులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. అంతా కలిసి అతడిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టారు. విషయం గుర్తించిన స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. తీవ్ర గాయాలపాలై ఉన్న రామారావును నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. భార్గవి మాత్రం అక్కడే ఉంది.
అయితే చికిత్స పొందతూ రామారావు శనివారం ఉదయం 3.35 గంటలకు మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి పంపించారు. రామారావు సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రామారావు భార్య భార్గవి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు గట్టిగా నిలదీశారు. దీంతో తామే అతడిని హత్య చేసినట్లు భార్గవి ఒప్పుకుంది. ఈ క్రమంలోనే భార్గవిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.