Punjab liquor prices drop :   పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం లిక్కర్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నూతన ఎక్సైజ్‌ పాలసీ 2022-23కి సీఎం భగవంత్ మాన్ ఆమోద ముద్ర వేశఆరు.  జులై 1వ తేదీ నుంచి ఈ పాలసీ అమల్లోకి రానుంది. కొత్త విధానంలో మద్యం ధరలను 35 నుంచి 60 శాతం వరకు తగ్గించేలా ప్రతిపాదించారు. అన్ని రకాల బ్రాండ్లపై తగ్గింపులు అమలు చేస్తారు.





 అయితే ప్రభుత్వానికి ఆదాయం తగ్గకుండా భగవంత్ మాన్ జాగ్రత్తలు తీసుకున్నారు.  2021-22లో రూ.6,158 కోట్ల ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,647.85 కోట్లకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.  ఇప్పటి వరకూ లాటరీ ద్వారా  మద్యం దుకాణాలను  కేటాయించే బదులు, టెండర్లను ఆహ్వానించడంద్వారా వేలం వేయాలని నిర్ణయించింది. మద్యం ధరల తగ్గించినా  ఎక్సైజ్‌ ఆదాయాన్ని 40 శాతం పెరుగుతుందని అంచనా వేస్తోంది. 


పంజాబ్‌లో మద్యం ధరలు తక్కువగానే ఉంటాయి. అక్కడి ప్రభుత్వానికి ఏడాది మొత్తం మీద గత ఏడాది వరకూ రూ. ఆరు వేల కోట్ల వరకే వచ్చేవి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు మాత్రం వచ్చే ఆదాయం ఒక్కో రాష్ట్రానికి రూ. పదిహేను వేల కోట్లకుపైగానే ఉంటుంది. నిజానికి పంజాబ్‌లోనే మద్యం వినియోగం ఎక్కువగానే ఉంటుంది. అయినా అక్కడ ధరలు తక్కువ కాబట్టి ప్రభుత్వాలకు ఆదాయం తక్కువగానే వస్తూంటుంది. 


భగవంత్ మాన్ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విభిన్న రీతిలో స్పందనలు తెలియచేస్తున్నారు. మందు బాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.