అమెరికా వెళ్లి అక్కడే నివసించాలి అని చాలా మంది భారతీయులతో పలు దేశాల యువత కల కంటుంటారు. కొందరు ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం పేరిట ప్రతి సంవత్సరం భారత్ నుంచి చాలా మంది అమెరికా కు వెళ్తుంటారు. వీసాలు రిజెక్ట్ అవ్వడంతో కొందరు నిరాశకు లోనవుతారు. నకిలీ సర్టిఫికెట్లలతో వెళ్ళడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తుంటారు.  కానీ ఏదైనా చేసి, అమెరికా వెళ్లిపోవాలని ఓ యువకుడు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.  యువకుడు అమెరికా వెళ్ళడానికి ఎం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు.
పంజామ్ యువకుడి అమెరికా డ్రీమ్స్..
పంజాబ్ రాష్ట్రం పాటియాలకు చెందిన జస్విందర్ సింగ్ అనే 26 ఏళ్ల యువకుడికి అమెరికా వెళ్లి నివసించాలని కలలు కనేవాడు. తన కలను నెరవేర్చుకోవడానికి అతను వేసిన ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు. అమెరికా వెళ్ళాలంటే అతనికి ఏదో ఒక మార్గం కావాలి. అందుకోసం తేలికైన పద్ధతి ఎంచుకున్నాడు. సినామా సీన్లలో చూపించినట్లుగా.. కవల సోదరుడు ఉన్నాడని సర్టిఫికెట్లు సృష్టించాడు. ఆ ట్విన్ బ్రదర్‌ చనిపోయాడని అతడి అంత్యక్రియల కోసం వెళ్ళాలి వీసా ఇవ్వండని అమెరికా ఎంబసీకి వెళ్ళాడు. అంతా ప్లాన్ చేసుకున్న జస్విందర్ సింగ్ అమెరికా ఎంబసీ అధికారులను తక్కువ అంచనా వేశాడు. తన మాస్టర్ ప్లాన్ ఫెయిల్ అయ్యి అరెస్ట్ అయ్యాడు.
 
నకిలీ డాక్యుమెంట్లతో అమెరికా వీసా కోసం జస్విందర్ సింగ్ ఢిల్లీలోని అమెరికా ఎంబసీకి ఇంటర్వ్యూకి డిసెంబర్ 6న వచ్చాడు. జస్విందర్ సింగ్ తాను పూనేలో 2017 నుంచి పోలీసు డిపార్ట్మెంట్ లో పని చేస్తున్ననని చెప్పాడు. అమెరికాలో నివాసం ఉంటున్న అతని తమ్ముడు కుల్విందర్ సింగ్   మరణించాడని, అతని అంత్యక్రియలకు హాజరవ్వాలని, అక్కడికి వెళ్లడానికి వీసా ఇవ్వమని కోరాడు. తన తమ్ముడి అంత్యక్రియలు నిజమే అని నమ్మించడానికి న్యూయార్క్ లోని ప్లీసంట్ విల్లె లోని 'బీచేర్ ఫ్లూక్స్ ఫుర్నేరాల్ హోం 'అక్టోబర్ 24 న అంత్యక్రియలకు  సంబంధించి జారీ చేసిన లెటర్ కూడా సబ్మిట్ చేశాడు. జస్విందర్ ఇచ్చిన తన తమ్ముడి డాక్యుమెంట్ లో, జస్విందర్ డాక్యుమెంట్ లో ఒకే రకమైన ఫోటో ఉండటంతో అమెరికా ఎంబసీ అధికారులకు అనుమానం వచ్చింది. విచారణ చేపట్టగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.


విచారణలో ఏం తేలిందంటే.. 
కుల్విందర్ సింగ్ అనే వ్యక్తి అమెరికాలోని న్యూయార్క్ లో నివసించడం లేదని అమెరికా అధికారుల విచారణలో తేలింది. జస్విందర్ చెప్తున్న తేదీన ఎవ్వరు మరణించలేదని గుర్తించారు. అధికారులు అన్ని నిజాలు బయటపెట్టడంతో జస్విందర్ సింగ్ తన తప్పును ఒప్పుకున్నాడు. తాను పోలీసు అధికారి కాదు అని, కానీ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశానని విచారణలో తెలిపాడు. పోలీసు అధికారి అని చెప్తే త్వరగా వీసా ఇస్తారని ఫేక్ డాక్యుమెంట్ సృష్టించానని ఒప్పుకున్నాడు. 


న్యూయార్క్ లో నివసించే తన మిత్రుడు ఆ అంత్యక్రియల సర్టిఫికెట్లు మెయిల్ ద్వారా పంపించాడని జస్విందర్ తెలిపాడు. ఢిల్లీ పోలీసులు జస్విందర్ సింగ్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తానంతట తాను ఈ ప్లాన్ తో వచ్చాడా, అక్రమంగా వ్యక్తుల్ని విదేశాలకు తరలించే వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కేసు విచారణ కోసం ఒక టీమ్ పంజాబ్ కు వెళ్తుందని పోలీసు అధికారి తెలిపారు.