గత కొంతకాలం నుంచి బీజేపీలో ముఖ్యమంత్రుల రాజీనామాలు ఆపై కొత్త సీఎంలు ప్రమాణ స్వీకారాలు చకచకా జరిగిపోతున్నాయి. కర్ణాటక, ఉత్తరాఖండ్ లలో బీజేపీ సీఎంలను మార్చుతూ గేర్ మార్చింది. ఇటీవల కాంగ్రెస్ లో సైతం ఇలాగే జరిగింది. పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ లో రాజకీయాలు వేడెక్కాయి. కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఎన్నికయ్యారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం సైతం పూర్తయింది.
పంజాబ్‌లో నూతన మంత్రివర్గం రేపు (సెప్టెంబర్ 26న) కొలువుదీరనుంది. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ కేబినెట్‌లో 15 మంది పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం కేబినెట్ లోకి రానున్న నేతల పేర్లు ప్రకటించనున్నారని ప్రచారం జరిగింది. అయితే కొలువుదీరనున్న నూతన మంత్రి వర్గం జాబితాను పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు పంపినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నూతన మంత్రివర్గంతో రాజ్‌భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనుంది. సోమవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్ జీత్ సింగ్ ఇప్పటివరకూ మూడు పర్యాయాలు ఢిల్లీకి వెళ్లొచ్చారు.
Also Read: 'ఐరాసలో ఓ ఛాయ్‌వాలా ప్రసంగం.. ప్రజాస్వామ్యానికి ఇదే నిదర్శనం'
ఏడుగురు కొత్త మంత్రులు..
కాంగ్రెస్ అధిష్టానం, ఎంపీ రాహుల్ గాంధీ, ఇతర కీలక నేతలతో చర్చించిన పంజాబ్ కొత్త సీఎం నూతన మంత్రివర్గం జాబితాను సిద్ధం చేశారు. పదిహేను మందితో కేబినెట్ జాబితా సిద్ధం చేయగా.. అందులో ఏడుగురు కొత్త వ్యక్తులకు మంత్రివర్గంలోకి ఆహ్వానం దక్కినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల పనిచేసిన ఐదుగురు మంత్రులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కకపోగా, ఏడుగురు కొత్త వారికి కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇవ్వడంతో కాంగ్రెస్ నేతల్లో ఆందోళన నెలకొంది.
Also Read: "పీఎం కేర్స్" ప్రభుత్వ నిధి కాదా ? విరాళాలు, ఖర్చులు ఎందుకంత రహస్యం !?
ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్ సిద్ధూ, క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి, ఆర్థిక శాఖ మంత్రి గుర్ ప్రీత్ సింగ్ కంగర్, పరిశ్రమలశాఖ మంత్రి సుందర్ షామ్ అరోరా, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి సాధు సింగ్ ధరమ్‌సాట్‌లను చరణ్‌జీత్ సింగ్ నూతన కేబినెట్ లోకి తీసుకోలేదని సమాచారం. మాజీ సీఎం అమరీందర్ విశ్వాసపాత్రులైన మొహింద్రా, విజేంద్ర సింఘ్లా, భరత్ భూషణ్ అషులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు.
Also Read: భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం మద్దతు - బస్సులు నిలిపివేయాలని నిర్ణయం!