రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో పారవేయడానికి వెళ్లగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రైతు ఉద్యమ నేత నరేష్ టికాయత్ రెజ్లర్ల అంశంపై జోక్యం చేసుకున్నారు. హరిద్వార్ కు వెళ్లి గంగా నదిలో తమ పతకాలను పారవేస్తున్న రెజ్లర్లను నరేష్ టికాయత్ నిలువరించారు. వారి సమస్యకు పరిష్కార మార్గాన్ని అన్వేషిద్దామని, ప్రస్తుతానికి పతకాలను గంగా నదిలో పారవేయవద్దని కోరారు. గంగలో పారవేసేందుకు రెజ్లర్ల చేతిలో ఉన్న పతకాల మూటను రైతు ఉద్యమ నేత టికాయత్ తీసుకున్నారు. ఐదు రోజుల గడువు ఇవ్వాలని, రెజ్లర్ల సమస్యకు పరిష్కారం వెతుకుదామన్నారు. ఓవైపు కన్నీటి పర్యంతమవుతూనే మరోవైపు ఆయనపై గౌరవంతో నరేష్ టికాయత్ మాటకు కట్టుబడి హరిద్వార్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు రెజ్లర్లు.






మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ జరిగిన లైంగిక వేధింపులపై న్యాయం చేయాలని దేశానికి చెందిన జాతీయ, అంతర్జాతీయ స్థాయి రెజ్లర్లు పలుమార్లు రిక్వెస్ట్ చేసినా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం గానీ రెజ్లర్లు పట్టించుకోలేదు అని వాపోతున్నారు. తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్.. తాము మంగళవారం సాయంత్రం లేక రాత్రిగానీ తాము సాధించిన పతకాలను, పురస్కారాలను గంగా నదిలో పారవేసి అనంతరం ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. 






వినేష్ ఫోగట్ చెప్పిన ప్రకారంగానే రెజ్లర్లు తాము సాధించిన పతకాలను గంగా నదిలో పారవేసేందుకు హరిద్వార్ కు వెళ్లారు. వారికి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ భారీ సంఖ్యలో అభిమానులు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. రెజ్లర్లు అందరి పతకాలను మూటకట్టి గంగా నదిలో పారవేయాలని సిద్ధమైన సమయంలో రైతు ఉద్యమ నేత నరేష్ టికాయత్ అక్కడికి చేరుకోవడంతో సీన్ రివర్స్ అయింది. రెజ్లర్ల సమస్యకు పరిష్కారం వెతుకుదామని, ప్రస్తుతానికి పతకాలను గంగలో పారవేయడాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. రెజ్లర్ల చేతిలో ఉన్న పతకాల మూటను తీసుకుని, సమస్య పరిష్కారం కోసం నరేష్ టికాయత్ ఐదు రోజులు గడువు ఇవ్వాలని కోరగా మహిళా రెజ్లర్లు కన్నీళ్లు పెట్టుకుంటూనే అందుకు ఓకే చెప్పారు. రెజ్లర్ల పోరాటానికి మద్దతు తెలిపిన టికాయత్ భవిష్యత్ కార్యచరణ ఏంటి అనేది ఢిల్లీలో ఆసక్తికరంగా మారింది.


కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా బ్రిజ్ భూషణ్‌కు మద్దతుగా నిలుస్తున్నారని, రెజ్లర్లకు న్యాయం జరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశం తరఫున బరిలోకి దిగి కుస్తీ పోటీల్లో పతకాలు తీసుకొస్తే తమకు కనీసం గౌరవం దక్కడం లేదని, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులు జరిగినా పట్టించుకోని స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉండటం దారుణం అన్నారు. రాజకీయంగా పవర్‌ఫుల్‌గా ఉన్న బ్రిజ్ భూషణ్‌ని ఎదుర్కోడం కష్టమని, కానీ న్యాయం జరిగేవరకు వెనక్కి తగ్గేదేలేదంటున్నారు రెజ్లర్లు.