RBI Fake Notes :  పెద్ద నోటు అంటే రూ. రెండు వేలు లేదా .. ఐదు వందల నోటు కనిపిస్తే.. దాన్ని పైకి ఎత్తి చూసి..అందులో సెక్యూరిటీ ఫీచర్స్ సరిపోల్చుకుని వర్జినలో కాదో నిర్ధారించుకుంటారు ఎక్కువ మంది. అయితే అలాంటి సెక్యూరిటీ ఫీచర్లను కూడా యాజిటీజ్ దించేసి మరీ ఫేక్ నోట్స్ తయారు చేస్తున్నారని.. వెబ్ సిరీస్‌లు తీస్తున్నారు. ఆ వెబ్ సీరిస్‌లలో వచ్చేది నిజమేనని ఆర్బీఐ చెబుతోంది. ఎందుకంటే  పెద్ద ఎత్తున నకిలీనోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ చెబుతోంది. 


రూ.2000 నోట్ల‌తో పోలిస్తే రూ.500 డినామినేష‌న్‌కు చెందిన న‌కిలీ నోట్లే ఎక్కువ‌గా స‌ర్క్యులేష‌న్‌లో ఉన్న‌ట్లు ఆర్బీఐ వెల్ల‌డించింది. 2022-23 సీజ‌న్‌లో రూ.500 డినామినేష‌న్‌కు చెందిన 14.4 శాతం న‌కిలీ నోట్ల‌ను గుర్తించిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది. గ‌త ఏడాది రూ.500కు చెందిన 91,110 నోట్ల‌ను గుర్తించిన‌ట్లు ఒక నివేదిక‌లో పేర్కొంది. ఇక అదే సంవ‌త్స‌ర కాలంలో రూ.2000 నోట్లలో కేవ‌లం 9806 నోట్లు మాత్ర‌మే న‌కిలీవేని వివ‌రాలు వెల్ల‌డించింది.. రూ.20కు చెందిన నోట్ల‌ల్లో కూడా 8.4 శాతం నోట్లు న‌కిలీవి దొరికిన‌ట్లు ఆర్బీఐ త‌న రిపోర్టులో తెలిపింది. ఇక రూ.10, రూ.1, రూ.2000 నోట్ల‌ల్లో న‌కిలీలు 11.6 శాతం ప‌డిపోయిన‌ట్లు ఆర్బీఐ పేర్కొన్న‌ది. ఫేక్ ఇండియ‌న్ క‌రెన్సీ నోట్స్ ప్ర‌కారం 2022-23లో 2,25,769 ఫేక్ నోట్లు రాగా, అంత‌కుముందు ఏడాది 2,30,971 న‌కిలీ నోట్లు వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ త‌న నివేదిక‌లో తెలిపింది. ఫేక్ నోట్ల‌లో 4.6 శాతం నోట్ల‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ గుర్తించ‌గా, ఇత‌ర బ్యాంకులు 95.4 శాతం నోట్ల‌ను గుర్తించాయి.


 మన వద్ద ఉన్న నోట్లలో ఏమైనా దొంగ నోట్లు ఉన్నాయనే అనుమానం వస్తే...ఏ బ్యాంకుకైనా తీసుకుని వెళ్లవచ్చు. ఆ బ్యాంకు సిబ్బంది ఆ నోటుని పరిశీలించి అది నకిలీదో, ఒరిజినల్‌దో చెప్తారు. ఒక వేళ నకిలీ నోటు అయితే ఆ బ్యాంకు సిబ్బంది దానిని తీసుకుని, ఎంత విలువైన నోటును తీసుకున్నారో, ఆ విలువను తెలుపుతూ ఒక రసీదు ఇస్తారు. ఆ నకిలీ నోటు ఎవరి వద్ద నుంచి మనకు వచ్చిందో, అతనికి ఆ రసీదు చూపించి...ఇచ్చినది నకిలీ నోటని చెప్పవచ్చు. అయితే ఆ రసీదుకు ఎటువంటి మారక విలువ ఉండదు.                                            


బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసే సమయంలో అక్కడున్న యంత్రాలు కానీ, సిబ్బంది కానీ నకిలీ నోట్లను గుర్తిస్తే బ్యాంకు సిబ్బంది తీసుకుంటారు. అలా తీసుకున్న నోట్ల విలువ శూన్యం. ఎందుకంటే అది నకిలీది కాబట్టి. అలాగే ఒక లావాదేవీలో నాలుగు, అంత కంటే తక్కువ నకిలీ నోట్లు వస్తే...బ్యాంకు సిబ్బంది ఆ విషయాన్ని అప్రమత్తత కోసం పోలీసులకు తెలియ చేస్తారు. అదే ఒక లావాదేవీలో ఐదు, అంతకంటే ఎక్కువ ఫేక్ నోట్లు వస్తే సమీప పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసు పెడతారు. అందుకే ఫేక్  నోట్స్ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.