Tunnel Collapse: 


కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..


ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సొరంగం (Uttarakhand Tunnel Collapse) కూలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఆ శిథిలాల కింద 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాళ్లను బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయినా ఇప్పటి వరకూ ఏ మార్గమూ దొరకలేదు. ఈ క్రమంలోనే కొందరు వర్కర్స్‌ ఘటనా స్థలం వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమ తోటి కార్మికులను బయటకు తీయాలంటూ నినదించారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులతో గొడవకు దిగారు. కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొస్తామని హామీ ఇచ్చినప్పటికీ వాళ్లు ఊరుకోలేదు. రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం అవుతోందంటూ అసహనం వ్యక్తం చేశారు. అటు అధికారులు మాత్రం వాళ్లను సేఫ్‌గా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆక్సిజన్ అందిస్తున్నారు. డ్రిల్లింగ్ మెషీన్‌లతో శిథిలాలను కట్ చేస్తున్నారు. కానీ ఇది వర్కౌట్ కాలేదు. దాదాపు 70 గంటలుగా శిథిలాల కిందే చిక్కుకున్నారు. 






ఈ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా బయటకు తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఝార్ఖండ్ నుంచి స్పెషల్ టీమ్ వచ్చి సహాయక చర్యలు చేపడుతోంది. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 10 మంది ఝార్ఖండ్ వాసులూ ఉన్నారు.