తల్లి హీరాబెన్‌ మోదీ మరణ వార్త విని భావోద్వేగానికి గురైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... ఆమె భౌతికకాయాన్ని చూసి మరింత ఎమోషన్ అయ్యారు. అలా చూస్తూ ఉండిపోయారు. ఆసుపత్రి నుంచి తీసుకొచ్చిన హీరాబెన్‌ పార్ధివ దేహాన్ని ఇంట్లో ఉంచారు. దిల్లీ నుంచి హుటాహుటిన వచ్చిన మోదీ... ఆమెకు నివాళి అర్పించారు. పార్థివదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. తర్వాత ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశారు. 


ప్రధానమంత్రి వచ్చిన తర్వాత తల్లి హీరాబెన్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో ప్రధాన మంత్రి మోదీ పాల్గొన్నారు. ప్రోటోకాల్‌ పక్కన పెట్టి తల్లి పాడె మోశారు. యాత్ర కొనసాగినంత దూరం కూడా ఆయనే పాడె మోశారు.కొంత దూరం వెళ్లిన తర్వాత వాహనంలో హీరాబెన్ పార్థివదేహాన్ని ఉంచారు. శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆ వాహనంలో భౌతిక కాయాన్ని ఉంచిన తర్వాత మోదీ ఒక్కరే వాహనంలో కూర్చున్నారు. అనంతరం వాహనాన్ని శ్మశాన వాటికకు తరలించారు. 


ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ 100 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్వీట్ చేసి తెలిపారు. నిండు నూరేళ్ల పాటు ఎంతో గౌరవంగా గడిపిన జీవితం ఆమెది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన  ట్వీట్‌లో తన తల్లి 100వ పుట్టిన రోజు సందర్భంగా తనకు ఏ విషయాలు చెప్పారో తెలిపారు. ఈ ఏడాది జూన్ 18న మోదీ తల్లి హీరాబెన్ 100వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆ సందర్భంగా తనకు తల్లి చెప్పిన మాటలను మోదీ ట్వీట్ చేశారు.


ఎల్లప్పుడూ మంచి తెలివితేటలతో, స్వచ్ఛంగా జీవించాలని, తెలివిగా పని చేయాలని తల్లి హీరాబెన్ తనకు చెప్పినట్లుగా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. బతికినంత కాలం స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని ఆమె సూచించినట్లుగా మోదీ గుర్తు చేస్తూ భావోద్వేగ ట్వీట్ చేశారు. 


‘‘తన 100వ పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలిసినపుడు నాతో ఒక మాట అన్నారు, పని తెలివితేటలతో, స్వచ్ఛతతో జీవించు, ఎప్పుడూ తెలివితో పని చేయండి, స్వచ్ఛతతో కూడిన జీవితాన్ని గడపాలి అని చెప్పారు అది ఎప్పుడూ గుర్తుంటుంది’’ అని ట్వీట్ చేశారు. “నా తల్లి ఈశ్వరుని పాదాలను చేరింది. ఆమె నిస్వార్థ కర్మ యోగికి ప్రతీక. నిబద్ధతతో కూడిన జీవితాన్ని కలిగి ఉన్న త్రిమూర్తుల మాదిరిగా నేను ఎప్పుడూ అనుభూతి చెందుతున్నాను’’ అని మోదీ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.






గాంధీనగర్‌లో అంత్యక్రియలు


గాంధీనగర్‌లో హీరాబెన్ భౌతికకాయానికి అంత్యక్రియలు చేశారు. సెక్టార్ 30లోని సంస్కార్ ధామ్‌లో అంత్యక్రియలు జరిపారు. హీరాబెన్ గాంధీనగర్ నగరానికి సమీపంలోని రైసన్ గ్రామంలో ప్రధాని మోదీ తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి ఉంటున్నారు. ఆమెను హీరా బా అని కూడా పిలుస్తారు. ప్రధాని గుజరాత్‌కు వచ్చినప్పుడల్లా చాలా సార్లు రైసన్‌కు వెళ్లి తన తల్లిని కలుసుకునేవారు.