NDA meeting:  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  ఎన్డీఏ మీటింగ్‌లో రాజ్యాంగ ప్రతికి ఇచ్చిన ప్రత్యేకమైన గౌరవం దేశవ్యాప్తంగా హైలెట్ అయింది. సమావేశానికి ముందు వేదిక వద్ద ఓ వైపు పెద్ద రాజ్యాంగ ప్రతిని టేబుల్‌పై ఏర్పాటు చేశారు. స్టేజిపైకి వెళ్లే ముందు నరేంద్రమోదీ రాజ్యాంగం వద్దకు వెళ్లి ప్రణామం చేశారు. ఇది  సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


ఎన్నికల సమయంలో రాజ్యాంగం అంశం 
దీనికి కారణం గత ఎన్నికల సమయంలో రాజ్యాంగం అంశం ఎన్నికల ప్రచారం అయింది. ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్ల కోసం ప్రయత్నిస్తోంది రాజ్యాంగాన్ని మార్చాడానికేనని కాంగ్రెస్ కూటమి ప్రచారం చేసింది. ఆరెస్సెస్ లక్ష్యం రిజర్వేషన్లు తీసేయడమేనని.. అవి తీసేయడానికి రాజ్యాంగాన్ని మార్చేందుకు నాలుగు వందల సీట్ల మెజార్టీని కోరుకుంటున్నారని ప్రచారం చేశారు. ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు బీజేపీ నేతలు తంటాలు పడ్డారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాజ్యాంగం జోలికి ఎవరూ రారని ప్రధాని మోదీ చెప్పుకోవాల్సి వచ్చింది.                       





క్లీన్ స్వీప్ చేస్తామనుకున్న బీజేపీ నేతలు


అయినప్పటికీ  అంశం ఎన్నికల్లో నష్టం చేసిందన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సారి కూడా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని బీజేపీ నేతలు అనుకున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ వంటి చోట్ల బీజేపీకి మంచి ఫలితాలు రాలేదు. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ వచ్చాయి. రాజ్యాంగం గురించి ఎక్కువగా వారే వ్యతిరేక ప్రచారం చేశారు. మరికొన్ని హిందీ రాష్ట్రాల్లోనూ నష్టం జరిగిందని బీజేపీ పెద్దలు భావించడంతో రాజ్యాంగానికి ఇలా ప్రధాని మోదీ ప్రత్యేకమైన గౌరవం ఇచ్చారని భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ ఇప్పటికీ రాజ్యాంగ ప్రతితోనే మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నారు. రాజ్యాంగం జోలికి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పడానికి బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.  





 


అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే.. ఇలా ఎన్డీఏ కూటమి  సమావేశాల్లో రాజ్యాంగానికి ప్రత్యేక గౌరవం ఇవ్వడం ఇదేమొదటి సారి కాదు. 2019లోనూ రాజ్యాంగ ప్రతిని ఇప్పుడు ఉంచినట్లే అప్పుడు ఉంచారు. అలాగే .. ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆ రాజ్యాంగానికి ప్రమాణం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తాను ప్రధాని అయ్యానని తరచూ గుర్తు చేసుకుంటారు కూడా.