President Murmu unfurls national flag : దేశ రాజధాని ఢిల్లీలో 76వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలు అంబరాన్నంటాయి. కర్తవ్య పథ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇండోసేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో గుర్రపు బగ్గీలో కర్తవ్య పథ్‌‌కు చేరుకోగా, ప్రధాని మోదీ వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, హోం, రక్షణ సహా కేంద్ర క్యాబినేట్ మంత్రులతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతలు హాజరయ్యారు.

రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (Prabowo Subianto) హాజరయ్యారు. స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ (సువర్ణ భారతం: వారసత్వం, అభివృద్ధి) అనే థీమ్‌తో ఈ సారి వేడుకలను నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది రిపబ్లిక్ పరేడ్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు చెందిన మొత్తం 31 శకటాలు, 18 మార్చింగ్ కంటింజెంట్లు, 15 బ్యాండ్లు పాల్గొన్నాయి. వీటితో పాటు దాదాపు 5వేల మంది కళాకారులు నృత్యరీతులతో సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇక త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని ప్రదర్శించారు.  రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లు పూర్తి కావడంతో ఈ సారి మరింత ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.

దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు

ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు మనం అద్భుతమైన గణతంత్ర వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రూపొందించి మన అభివృద్ధి ప్రయాణం ప్రజాస్వామ్యం, ఐక్యత, గౌరవంపై ఆధారపడేలా మార్గాన్ని నిర్దేశించిన మహనీయులందరికీ నివాళులర్పిస్తున్నాను అని మోదీ తన ఎక్స్ పోస్ట్ లో రాశారు. ఆయనతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నేతలు రిపబ్లిక్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి

అంతకుముందు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు చాలా ప్రత్యేకమైందని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వెచ్చి 75 ఏళ్లు పూర్తి కావడం దేశం మొత్తం గర్వించదగిన విషయమన్నారు. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందని, అంతర్జాతీయంగా నాయకత్వం వహించే స్థాయికి భారత్ ఎదిగిందని ముర్ము వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భరతమాత విముక్తి కోసం జీవితాలను త్యాగం చేసిన వారిని స్మరించుకోవాలని చెప్పారు. జమిలీ ఎన్నికలపైనా స్పందించిన రాష్ట్రపతి.. సుపరిపాలన అందించేందుకు ఇదొక మార్గమన్నారు. ఇది పాలనలో స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుందని, వనరుల మళ్లింపు తగ్గుతుందని, ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.

కట్టుదిట్టమైన భద్రత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు సజావుగా జరిగేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర ప్రజల అవసరార్థం అంతటా 35 హెల్ప్ డెస్క్ లు, నగరం చుట్టూ దాదాపు 15వేల మంది పోలీసులు మోహరించారు. 6 అంచెల తనిఖీతో పాటు యాంటీ-డ్రోన్ సిస్టమ్స్, ఆర్మీ హెలికాప్టర్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రత కారణాల రిత్యా వేడుకలకు వచ్చే అతిథులకు క్యూఆర్ కోడ్‌ల ద్వారా ప్రవేశం కల్పించారు. ఇందుకోసం ముందే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో టిక్కెట్లు ఇచ్చారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 29న విజయ్ చౌక్‌లో జరిగే బీటింగ్ రిట్రీట్‌తో ముగుస్తాయి. 

Also Read : Republic Day Google Doodle: రిపబ్లిక్ డే గూగుల్ డూడుల్ చూశారా? దాన్ని ఎవరు రూపొందించారు? అర్థం ఏంటంటే