President Droupadi Murmu : దేశ భద్రత, పురోగతి, శ్రేయస్సు కోసం చేయగలిగినదంతా చేస్తామని ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ 75వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఆదివారం రాష్ట్రపతి జాతీనుద్దేశించి మాట్లాడారు. దేశంలో లింగ అసమానతలు తగ్గుతున్నాయని, మహిళలు అడ్డంకులు అధిగమించి ముందుకు దూసుకెళ్తున్నారని రాష్ట్రపతి  అన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం అన్నారు. భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకుంటుందన్నారు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ సంకెళ్లను తెంచుకుని స్వాతంత్ర్యం సాధించామని రాష్ట్రపతి గుర్తుచేశారు. భారతీయులు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం కోసం ఎందరో తమ సర్వస్వాన్ని త్యాగం చేశారన్నారు. వారి త్యాగాలను మరోసారి స్మరించుకోవాల్సిన సందర్భం వచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ విభజన సందర్భంగా ఆగస్టు 14న  స్మృతి దివస్‌ జరుపుకుంటున్నామన్నారు. 2021 మార్చి నుంచి ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకొంటున్నామని ఆమె అన్నారు.






ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 


ఆత్మనిర్భర్‌ భారత్‌ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్రపతి కోరారు. దేశ ప్రజలు స్వాతంత్ర్య వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు.  దేశ వ్యాప్తంగా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోందన్నారు. ప్రజాస్వామ్య సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపడంలో భారత్‌ తన సత్తా చాటిందన్నారు. భారత్‌ అంటే భిన్నత్వంలో ఏకత్వం అన్నారు. అనేక రకాల వైవిధ్యంతో నిండి ఉందన్నారు. ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌ స్ఫూర్తితో అందరూ కలిసి నడవడానికి ప్రేరేపిస్తోందన్నారు.


ఆగస్ట్ 14న స్మృతి దివాస్ 


" 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ మహత్తర సందర్భంలో మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. భారతదేశం స్వతంత్ర దేశంగా 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. సామాజిక సామరస్యం, ఐక్యత, ప్రజల సాధికారతను ప్రోత్సహించడానికి ఆగస్ట్ 14న స్మృతి దివాస్ గా పాటిస్తున్నాం. వలస పాలకుల కబంధహస్తాల నుంచి మనల్ని మనం విముక్తులను చేసుకుని, మన దేశాన్ని పునర్నిర్మించుకోవాలని నిర్ణయించిన రోజు స్వాతంత్ర్య దినోత్సవం. మనమందరం ఈ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో భారతదేశంలో స్వేచ్ఛగా జీవించడం సాధ్యమయ్యేందుకు అపారమైన త్యాగాలు చేసిన అందరినీ మనం గుర్తుచేసుకోవాలి" అని ప్రెసిడెంట్ ముర్ము  అన్నారు. 


ప్రపంచానికే మార్గదర్శి


కరోనా సమయంలో ప్రపంచమంతా ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని, ఈ క్లిష్ట సమయాన్ని భారత్ సమర్థంగా ఎదుర్కొందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కరోనా ఎదుర్కొని ప్రపంచానికి భారత్‌ ఓ మార్గదర్శిలా నిలిచిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టిందని గుర్తుచేశారు. అంకుర సంస్థలతో భారత్‌ అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్‌ విధానం పెనుమార్పులు తీసుకొచ్చిందన్నారు. దేశంలో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించిందని రాష్ట్రపతి అన్నారు. 


Also Read : Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు