President hosted dinner for outgoing Union cabinet Ministers: న్యూఢిల్లీ: ఎన్డీఏ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వెళ్లారు. బుధవారం ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ నేతలు కీలకంగా భేటీ అయ్యారు. ఎన్డీయే విజయం కోసం కృషి చేసిన నేతలు అందర్నీ అభినందించారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమి పక్షనేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు. దాంతో వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్రంలో ఈసారి 400 సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు కానీ సీట్లు ఆశించిన మేర రాలేదు.


రాష్ట్రపతి భవన్‌లో విందు 
ఎన్డీయే భేటీ అనంతరం కేంద్ర మంత్రులకు రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్, కేంద్రంలోని ఇతర కేబినెట్ మంత్రులకు రాష్ట్రపతి భవన్ లో ద్రౌపది ముర్ము విందు ఇచ్చారు. గత ఐదేళ్లు ప్రజలకు సేవలు అందించిన మోదీ నేతృత్వంలోని మంత్రివర్గానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. నేటి సాయంత్రం నరేంద్ర మోదీ రాజీనామాను ఆమోదించారు. ప్రధాని పదవికి మోదీ సమర్పించిన రాజీనామా లేఖకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. మోదీ నాయకత్వంలో ఎన్డీయే 3.0 సర్కార్ త్వరలో కొలువుదీరనుంది. 




జూన్ 7న మరోసారి ఎన్డీయే సమావేశం 
ఎన్డీఏ నేతలు బుధవారం సమావేశమై ప్రభుత్వ ఏర్పాటు, మద్దతుపై చర్చించారు. ఎన్డీయేలోని బీజేపీయేతర పార్టీ నేతలు కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలిపారు. ఎన్డీయే నేతలు జూన్ 7న మరోసారి భేటీ కానున్నాయి. ఆ రోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అదేరోజు రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ద్రౌపది ముర్మును కోరతారని సమాచారం.






ప్రధానిగా నరేంద్ర మోదీ జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం వాయిదా వేసుకున్నారు. అనుకున్న దాని ప్రకారం జూన్ 9న చంద్రబాబు ప్రమాణం చేయాల్సి ఉంది. కానీ ప్రధానిగా మోదీ ప్రమాన స్వీకారం అదేరోజు ఉండటంతో జూన్ 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.