Sharmishtha's Pranab My Father: 


ప్రణబ్‌ కూతురి పుస్తకం..


కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) కూతురు షర్మిష్టా ముఖర్జీ (Sharmishtha Mukherjee) ఓ పుస్తకం రాశారు. ప్రస్తుతం ఇది రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రణబ్‌కి నమ్మకం లేదంటూ ఆ పుస్తకంలో ప్రస్తావించారు షర్మిష్టా. కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే సామర్థ్యం రాహుల్‌కి లేదని ఆయన చాలా సార్లు అసహనం వ్యక్తం చేసినట్టు పుస్తకంలో పేర్కొన్నారు షర్మిష్ట. "Pranab My Father" పేరుతో ఆమె రాసిన పుస్తకం ఇటీవలే విడుదలైంది. ఆమె కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. ఆమె రాసిన బుక్‌లో రాహుల్ గాంధీతో పాటు మొత్తం గాంధీ కుటుంబంపై ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు షర్మిష్ట. 


"ఓ ఉదయం మొఘల్ గార్డెన్స్‌లో ప్రణబ్ ముఖర్జీ మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ ఆయనను కలవడానికి వచ్చారు. మార్నింగ్ వాక్‌ చేసేప్పుడు ఎవరు డిస్టర్బ్ చేసినా ప్రణబ్‌కి నచ్చదు. అయినా సరే రాహుల్ కలవడానికి వచ్చారు. రాహుల్ సాయంత్రం కలవాల్సి ఉన్నా...కానీ ఆ విషయం సరిగ్గా కమ్యూనికేట్ అవ్వలేదు. ఆ సమయంలోనే మా నాన్న నాతో ఓ మాట అన్నారు. ఉదయం, సాయంత్రానికి తేడా తెలియని వ్యక్తి ప్రధాని ఎలా అవుతారని అసహనం వ్యక్తం చేశారు" 


- షర్మిష్ట ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ కూతురు






గాంధీ కుటుంబంతో అనుబంధం..


ఈ పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ ఐడియాలజీనీ ప్రస్తావించారు షర్మిష్ట. ప్రస్తుత రాజకీయాలపై ఆయన అభిప్రాయాలనూ వివరించింది. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రణబ్ ముఖర్జీ...2020లో కన్నుమూశారు. దాదాపు మూడు తరాల గాంధీలతో సన్నిహితంగా ఉన్నారు ప్రణబ్. రాహుల్ గాంధీ ఎంపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తొలి రోజుల్లో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక, రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ఆయన రాసుకున్న డైరీలోని కొన్ని విషయాలనూ ఈ బుక్‌లో ప్రస్తావించారు. 


"2014 డిసెంబర్‌లో AICCలో పార్టీ 130వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఆ ఈవెంట్‌కి రాహుల్ గాంధీ రాలేదు. కారణాలేంటన్నది తెలీదు. ఆయనకు పార్టీ వేడుకలంటే ఏ మాత్రం గౌరవం లేదు. ఆ సమయంలో సోనియా గాంధీ కూడా ఆందోళన చెందారు. తన తరవాత రాహుల్‌కి పూర్తిగా బాధ్యతలు అప్పగించాలని అనుకున్నారు. ఆయన పార్టీని ముందుకు నడిపించగలరా అని నాన్న అనేవారు"


- షర్మిష్ట ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ కూతురు


Also Read: ఛాయ్ తాగి సమోసాలు తినడం తప్ప ఏమీ చేయరు - I.N.D.I.A కూటమిపై జేడీయూ ఎంపీ విమర్శలు