Madhya Pradesh Police suspend constable: ఒక్కో ప్రాంతంలో ఒక్కో తరహాలో పనిష్‌మెంట్ ఉంటాయి. అయితే కొన్ని సందర్భాలలో కొందరు తప్పు చేయకున్నా, పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించకపోవడంతో అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో ఇలాంటి ఘటనే జరిగింది. కానిస్టేబుల్‌కు పోలీస్ శాఖ షాకిచ్చింది. అయినా కానిస్టేబుల్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ఆ వివరాలిలా ఉన్నాయి.


సినిమాల్లో స్టార్లు హీరోయిజం చూపించేలా మీసాలు తనదైన స్టైల్‌లో పెంచడం చూశాం. అదే విధంగా మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో రాకేష్ రాణా పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మీసాలు పెద్దగా పెంచాడని పోలీస్ శాఖ కానిస్టేబుల్‌కు ఝలక్ ఇచ్చింది. జుత్తు, మీసాలు మరీ పెద్దగా పెంచాడని పోలీస్ శాఖ అతడ్ని సస్పెండ్ చేసింది. ఈ విషయంపై అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ప్రశాంత్ శర్మ స్పందించారు. రాకేష్ రాణా పోలీస్ శాఖ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో డ్రైవర్‌గా చేస్తున్నాడు. గత కొన్నిరోజులుగా మీసాలు పెద్దగా పెంచుకున్నాడు, జుత్తు మెడ వరకు పెంచాడు. అయితే యూనిఫాం ధరించి విధులకు హాజరయ్యే వ్యక్తి అలా ఉండటం పద్ధతి కాదన్నారు. 


గతంలో పలుమార్లు హెచ్చరించినా తమ మాట పట్టించుకోని కారణంగా కానిస్టేబుల్‌పై చర్య తీసుకుంటూ సస్పెండ్ చేశామని చెప్పారు. వేషధారణ సరిగా లేదని, ఉన్నతాధికారులు చెప్పిన మాటలు అతడు పట్టించుకోవడం లేని కారణంగా కానిస్టేబుల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పోలీసు డిపార్ట్ మెంట్ అయినప్పటికీ, తాను చేసేది డ్రైవర్ ఉద్యోగమే కదా అనుకున్న కానిస్టేబుల్ రాకేష్ రాణాకు ఉన్నతాధికారులు షాకిచ్చారు. తాత్కాలికంగా విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


బాధిత కానిస్టేబుల్ రాకేష్ రాణా మాత్రం ఈ విషయంలో తగ్గేదే లేదంటున్నాడు. మీసాలు పెంచుకోవడం తన ఆత్మగౌరవ విషయమని, కనుక తాను వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నాడు. తన ఆహార్యం వల్ల ఎవరికీ ఇబ్బంది కలగలేదని, ఈ విషయంలో తాను పోరాటం కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నాడు. మీసాలు పెంచుకున్న కారణంగా కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురైన వార్త దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. మీకు ఈ విషయం తెలుసా అంటూ నెటిజన్లు సైతం ఈ న్యూస్ షేర్ చేసుకుంటున్నారు.


Also Read: Fake News: నకిలీ వార్తలు మనుషుల భావోద్వేగాలను ఎంతగా ప్రభావితం చేస్తాయంటే.... ఓ కొత్త అధ్యయనం


Also Read: Gold-Silver Price: నేడు అతి స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి మాత్రం నిలకడగా.. ఇవాల్టి ధరలు ఇలా..


Also Read: Cinema Tickets Issue: పేర్ని నానితో ఆర్జీవీ భేటీకి టైమ్ ఫిక్స్.. సోమవారమైనా టికెట్స్ రేట్లపై క్లారిటీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి