డ్రీమ్‌ 11లో పందెం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మహారాష్ట్రకు చెందిన పోలీస్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమనాథ్‌  చాలా అదృష్టవంతుడంటూ కొన్ని రోజులగా ఒకటే వార్తలు. మహారాష్ట్రలోని పింప్రి చించ్‌వాడ్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన సోమనాథ్‌ జెండే.. ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సోమనాథ్‌ బెట్టింగ్‌ వేశాడు. ఈ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంపిక చేసిన జట్టు ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలవడంతో ఆయనకు కోటీన్నర రూపాయల జాక్‌పాట్‌ తలిగింది. ఇంతవరకు బాగానే ఉంది కానీ కోటీన్నర గెలిచి సంబరాల్లో మునిగిపోతున్న సోమనాథ్‌కు పోలీస్ డిపార్ట్‌మెంట్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. నిబంధనలను అతిక్రమించి పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ ఆయనను విధుల నుంచి సస్పెండు చేస్తున్నట్లు ఏసీపీ సతీశ్‌ మానే ప్రకటించారు. ఛించ్వాడ్‌ పోలీస్‌ కమిషనరేటులో పనిచేసే సోమనాథ్‌ అక్టోబరు 10న విధుల్లో ఉండి మరీ ఇంగ్లాండ్‌ - బంగ్లాదేశ్‌ మ్యాచ్‌పై బెట్టింగులో పాల్గొని నిబంధనలు అతిక్రమించారని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌లో పాల్గొనడమే కాకుండా విధులను నిర్లక్ష్యం చేశారని.. అందుకే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సోమనాథ్‌పై తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు.  కోటీన్నర గెలిచిన ఆనందంతో ఉబ్బితబ్బియిపోతున్న సోమనాథ్‌ ఆనందం ఉన్నతాధికారుల చర్యతో ఆ ఆనందం ఆవిరైంది. ఉన్నతాధికారులు తనపై తీసుకొన్న క్రమశిక్షణ చర్యతో మరోసారి సోమనాథ్‌ వార్తల్లోకి ఎక్కారు. 

 

అసలేం జరిగిందంటే?

చించ్‌వాడ్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న సోమనాథ్ జెండే.. డ్రీమ్ 11లో పాల్గొని రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. మూడు నెలలుగా సోమనాథ్‌ డ్రీమ్‌ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌-బంగ్లాదేశ్‌ తలపడ్డాయి. ఈ ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే టీమ్‌ను ఎంపిక చేసుకున్నాడు. కొన్ని నెలలుగా డ్రీమ్ 11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాని, కానీ ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చిందని తెలిపాడు. మొత్తం డబ్బు వచ్చిన తర్వాత సగం డబ్బుతో ఇంటి రుణం తీరుస్తానన్నారు. అలాగే మిగతా సగం డబ్బును భవిష్యత్తు అవసరాలకోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని, దాని ద్వారా వచ్చే వడ్డీ డబ్బులు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని చెప్పారు. 

 

డ్రీమ్‌ 11లో కోటీన్నర గెలిచిన విషయాన్ని గొప్పగా, ఓపెన్‌గా చెప్పుకున్నాడు ఎస్‌ఐ సోమనాథ్‌. ఇదీ పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ అసలు ఆన్‌లైన్ గేమ్‌లో పాల్గొనవచ్చా..? ఈ గేమ్ చట్టబద్ధమేనా..? ఇలా వచ్చిన డబ్బు గురించి మీడియాతో మాట్లాడవచ్చా..? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. దీనిపై పూర్తి విచారణ బాధ్యతను డీసీపీకి అప్పగించారు. అనంతరం అందిన నివేదిక ఆధారంగా సోమనాథ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

 

జమ్ముకశ్మీర్‌లోనూ..

కొద్దిరోజుల క్రితం.. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు కూడా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. డ్రీమ్‌ 11లో పందెం వేసి 2 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. కశ్మీర్‌లోని బిజబిహారకు చెందిన వసీం రాజా రెండేళ్లుగా డ్రీమ్‌ 11లో బెట్టింగ్‌ వేసేవాడు. ఎప్పటిలాగే బెట్టింగ్ వేయగా అదృష్టం వరించి రెండు కోట్ల రూపాయలను గెలుచుకున్నాడు.