PM Modi | న్యూఢిల్లీ: దేశంలోని విద్యార్థుల భవిష్యత్తు పరిరక్షణే భారత ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ తరువాత జరిగిన పరిణామాలతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విద్యా వ్యవస్థ, పరీక్షల విధానంలో సంస్కరణలపై సిఫార్సులు చేయడానికి ఇన్వోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకున్న నేరస్థులపై ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటోందని ఆయన వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.
రాబోయే రోజుల్లో పరీక్షా విధానంలో పారదర్శకత, విశ్వసనీయత పెంచడం అత్యంత కీలకమని ప్రధాని మోదీ చెప్పారు. పరీక్షల నిర్వహణలో సాంకేతికతను సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా నందన్ నిలేకణి (Nandan Nilekani) నేతృత్వంలో హైపవర్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ టాస్క్‌ఫోర్స్ ప్రధానంగా పరీక్షల సంస్కరణలపై దృష్టి సారిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సమర్పించే నివేదిక ఆధారంగా రాబోయే పరీక్షలపై విశ్వసనీయతను పెంచేలా, లీకేజీలకు తావులేకుండా నమ్మకమైన పరీక్షా వ్యవస్థను రూపొందిస్తామని హామీ ఇచ్చారు. పేపర్ లీకులు అరికట్టేందుకు కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతున్నామని, సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని మోదీ పేర్కొన్నారు.
టాస్క్ ఫోర్స్ కమిటీలో సభ్యులు వీరే..
నందన్ నీలేకని చైర్మన్‌గా వ్యవహరించనుండగా ఈ టాస్క్ ఫోర్సులో మరో ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి, కేంద్ర విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్, పరిపాలనా నిపుణులు అయిన అమృత్ లాల్ మీనా సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ ప్రధానంగా ఏం చేస్తుంది..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటైంది. ప్రశ్నపత్రాల లీకేజీలు, మాల్‌ప్రాక్టీస్‌లను అరికట్టడానికి అత్యాధునిక సాంకేతిక భద్రత, డిజిటల్ డేటా రక్షణ, అభ్యర్థుల వెరిఫికేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ కమిటీ ప్రధాన ధ్యేయం. భవిష్యత్తులో ప్రభుత్వ పోటీ పరీక్షలన్నీ పూర్తి పారదర్శకత, విశ్వసనీయతతో నిర్వహించేలా ఈ కమిటీ నిర్మాణాత్మక సంస్కరణలను కేంద్ర ప్రభుత్వానికి సూచించనుంది.
Also Read: Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
పేపర్ లీక్ విచారణపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు
పేపర్ లీక్‌లతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న నిందితులు ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇటువంటి కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు పూర్తి స్వేచ్ఛ, కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందని మోదీ ఇటీవల పేర్కొన్నారు. అదనంగా, పార్లమెంటులో కఠినమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకురావడానికి కేంద్రం చర్యలు చేపట్టిందని ఆయన ప్రకటించారు.
