Indian Railway Stations:


అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ 


దేశవ్యాప్తంగా ఉన్న 508 రైల్వే స్టేషన్‌లను నవీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా రైల్వే స్టేషన్‌లను కొత్త హంగులతో తీర్చిదిద్దాలనేదే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ప్రాజెక్ట్‌కి Amrit Bharat Station Scheme అనే పేరు పెట్టింది కేంద్రం. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు రైల్వే ప్రయాణికులకు అందించడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశమని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. రోజూ లక్షలాది మంది ప్రజల్ని తమ గమ్య స్థానాలకు చేర్చుతున్న రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో నవీకరిస్తోంది మోదీ సర్కార్. అందులో భాగంగానే ఇప్పటికే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు రైల్వే స్టేషన్‌లపై దృష్టి సారించింది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన వసతులు అందించడం కోసమే ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 1309 స్టేషన్‌లను నవీకరిస్తామని వెల్లడించారు. మొదటి విడతలో భాగంగా 508 స్టేషన్‌లను ఎంపిక చేసుకున్నారు. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. 


"అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 508 స్టేషన్‌లను నవీకరించే పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వీటి కోసం రూ. 24,470 కోట్లు ఖర్చు చేస్తోంది కేంద్రం. ఇప్పటికే ఈ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. ప్రధాన నగరాలపై ముందుగా దృష్టి సారిస్తోంది"


- ప్రధానమంత్రి కార్యాలయం 






27 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 508 స్టేషన్‌లను ముందుగా ఎంపిక చేశారు. వీటిలో యూపీలో 55 స్టేషన్‌లు, రాజస్థాన్‌లో 55 స్టేషన్‌లున్నాయి. ఇక బిహార్‌లో 49, మహారాష్ట్రలో 44, వెస్ట్ బెంగాల్‌లో 37 ఉన్నాయి.


ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. క్విట్ ఇండియా ఉద్యమమే స్ఫూర్తిగా భారత్ అవినీతిని దేశం నుంచి తరిమి కొడుతోందని ప్రతిక్షాలకు చురకలు అంటించారు. 


"ఆగస్టు 9 భారత దేశ చరిత్రలోనే కీలకమైంది. మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు ఇదే. ఈ ఉద్యమంతోనే గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టారు. ప్రతికూల శక్తుల్ని తరిమి కొట్టారు. ఇప్పుడు కూడా దేశం మొత్తం క్విట్ ఇండియా ఉద్యమం చేస్తోంది. అవినీతి, వారసత్వ రాజకీయాలను దేశం నుంచి తరిమికొట్టేలా క్విట్ ఇండియా ఉద్యమం చేస్తోంది"


- ప్రధాని నరేంద్ర మోదీ