Delhi Election: ఢిల్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఈ తరుణంలో ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. కరవాల్ నగర్ స్థానంలో ర్యాలీ నిర్వహించిన ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీని, కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ర్యాలీలో భాగంగా హాజరైన ప్రధాని వేదికపైకి రాగానే, పట్‌పర్‌గంజ్ స్థానం నుంచి పోటీ చేస్తోన్న బీజేపీ అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి మోదీ పాదాలను తాకారు. ఆ తర్వాత ప్రధాని, రవీంద్ర నేగి పాదాలను మూడుసార్లు తాకారు. నిజానికి ఈ ఘటనతో అక్కడున్న నేతలు ఆశ్చర్యపోయారు. దీంతో బీజేపీ అభ్యర్థి రవీంద్ర నేగి కాస్త అసౌకర్యానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ సన్నివేశానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.





రవీంద్ర సింగ్ నేగి ఎవరంటే..


బీజేపీకి చెందిన రవీంద్ర సింగ్ నేగి ఢిల్లీలో జరిగిన గత ఎన్నికల్లో పట్‌పట్‌గంజ్ సీటు కోసం పోటీ చేశారు. ఈ స్థానంలో ఆప్ పార్టీ నుంచి పోటీ చేసిన మనీష్ సిసోడియాకు గట్టి పోటీ ఇచ్చారు. అతికష్టం మీద మనీష్ సిసోడియా ఈ స్థానాన్ని గెలుచుకోగలిగారు. ఈ సారి ఆప్ నుంచి విద్యావేత్త అవధ్ ఓజాకు ఈ స్థానం నుంచి టిక్కెట్టు ఇవ్వగా.. నేగి జంగ్‌పురా ఆయనపై పోటీ చేస్తున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన రవీంద్ర సింగ్ నేగి ప్రస్తుతం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యుడిగా.. వినోద్ నగర్ వార్డు-198కి చెందిన కౌన్సిలర్ గా ఉన్నారు. వినోద్ నగర్ వార్డు పట్‌పట్‌గంజ్ అసెంబ్లీ స్థానం పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన నేగి..  సిసోడియా గట్టి పోటీ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. ఆర్ఆర్ఆర్ లోనూ నేగికి మంచి పట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఆయన విస్తారక్ వంటి అనేక ముఖ్యమైన పదవులకు బాధ్యతలు వహించారు.


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయం


ఢిల్లీలోని ఘోండా నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని నొక్కి చెప్పారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఆప్‌ సర్కారు పోయి, బీజేపీ సర్కారు వస్తుందని, తానొక్కడే కాదు యావత్‌ ఢిల్లీ ప్రజానికం కూడా అదే అంటున్నారన్నారు.గత 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని మోదీ విమర్శించారు. అబద్దపు హామీలను ఇప్పుడు ఢిల్లీ ప్రజలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పారు. ఈ క్రమంలోనే బీజేపీ విడుదల చేసిన మేనిఫోస్టోను మోదీ మెచ్చుకున్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందేలా మేనిఫెస్టో ఉందని చెప్పారు.


కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్


ఢిల్లీ ఎన్నికలను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పాటు, మహిళలకు నెలనెలా రూ.2,500 ఆర్థిక సాయం ప్రకటించింది. సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు ఇచ్చే పెన్షన్ ను రూ.5వేలకు పెంచుతామని చెప్పింది. యువత కోసం ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఒక ఏడాది అప్రెంటిస్ షిప్, నెలకు రూ.8,500 స్టైఫండ్ ఇస్తామని మేనిఫెస్టో లో తెలిపింది.


Also Read : Kumbh Mela 2025: మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన - భారత్‌లో ఊహకందని ఆధ్యాత్మిక విషాదాలివే!