Mahakumbh Mela Stampede 2025: ప్రపంచదేశాలే ఆశ్చర్యపోయేలా భారత్​లో జరుగుతున్న పవిత్ర మహా కుంభమేళా (Kumbh Mela)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం మౌని అమావాస్య కారణంగా భారీగా జనం తరలిరావడంతో తెల్లవారుజామున తొక్కిసలాట జరిగి 20 మంది మృతి చెందారు. వంద మందికిపైగానే గాయపడ్డారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. విపరీతమైన రద్దీ వల్ల చీకట్లో అక్కడున్న చెత్త డబ్బాలకు కాళ్లు తగిలి ఒకరి మీద ఒకరు పడడంతోనే తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

చిమ్మ చీకటిలో కనిపించక..

ఆ భయానక ఘటనకు సంబంధించి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు తమ అనుభవాలను అక్కడి మీడియాతో పంచుకున్నారు. విపరీతమైన రద్దీ వల్ల ఎటు వెళ్లాలో తెలియక గందరగోళ పరిస్థితి నెలకొని తొక్కిసలాట జరిగినట్లు పేర్కొన్నారు. ‘తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మౌని అమావాస్య నేపథ్యంలో త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసేందుకు ఒక్కసారిగా భక్తులు బయల్దేరారు. తలపై పెద్ద పెద్ద లగేజీలతో తరలివచ్చారు. వారికి ఎటు నుంచి వెళ్లాలి.. ఎక్కడ పుణ్య స్నానాలు చేయాలనే దానిపై అవగాహన లేదు. చెత్త వేసేందుకు ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇనుప డబ్బాలు ఏర్పాటు చేశారు. చిమ్మచీకట్లో అవి ఎవరికీ కన్పించలేదు. దీంతో వాటికి తగిలి చాలా మంది కింద పడిపోయారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది’ ప్రత్యక్ష సాక్షిఒకరు సోషల్​ మీడియా ద్వారా తెలిపారు.

'దారులన్నీ మూసుకుపోయాయి'

ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోయాయని, అందువల్లే పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని మరో వ్యక్తి తెలిపారు. అయితే భక్తులంతా సంగమం ప్రధాన ఘాట్‌ వద్దే స్నానాలు చేసేందుకు యత్నించగా ఆ మార్గంలోని బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగిన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరణాల సంఖ్యపై యూపీ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. 

పుణ్యస్నానాల నిలిపివేత.. ఆపై పునరుద్ధరణ

తొక్కిసలాట ఘటనతో త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలను నిలిపివేస్తున్నట్లు 13 అఖాడాలు ప్రకటించారు. అయితే కొన్ని గంటల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చాక అమృత స్నానాలను పునరుద్ధరించారు. ప్రసుత్తం పరిస్థితులు తమ అదుపులో ఉన్నట్లు డీఐజీ వైభవ్​ కృష్ణ తెలిపారు. 

Also Read: Mahakumbh Mela Stampede 2025: మహా కుంభమేళాలో ఘోర విషాదం - 20 మంది మృతి?, 100 మందికి పైగా గాయాలు