Pm Modi Responds On Rahul Gandhi Contesting From Raebareli: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahulgandhi) రాయ్ బరేలీ (Raebareli) నుంచి పోటీ చేయాలన్న నిర్ణయంపై ప్రధాని మోదీ (Pm Modi) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వయనాడ్ లో ఓడిపోతారని తెలిసే రాహుల్ రాయ్ బరేలీకి పారిపోయారని ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్ లోని బర్దమాన్ లో ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం సభలో టీఎంసీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే రాహుల్ అమేథీ నుంచి పారిపోయారని.. భయం వద్దు (డరో మత్), పారిపోవద్దు (భాగో మత్) అంటూ సెటైర్లు వేశారు. కాగా, బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తుందని ఆరోపించే క్రమంలో రాహుల్ గాంధీ తరచూ 'భయం వద్దు (డరో మత్)' అంటూ పేర్కొంటుంటారు. 


'అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఇప్పటికే భయపడుతోంది. అమేథీ వదిలి రాహుల్.. రాయ్ బరేలీకి పారిపోయారు. రాహుల్ వయనాడ్, రాయ్ బరేలీలోనూ పోటీ చేస్తున్నారు. ఆయన వయనాడ్ లోనూ ఓటమి పాలవుతారు.' అంటూ ప్రధాని మోదీ జోస్యం చెప్పారు.






'వారికి ధైర్యం లేదు'


'కాంగ్రెస్ లో అతి పెద్ద నేతకు ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే రాజస్థాన్ కు పారిపోయిన ఆమె రాజ్యసభకు వచ్చారు.' అంటూ సోనియా గాంధీని ఉద్దేశించి మోదీ విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2019 కంటే తక్కువ సీట్లు గెలుస్తుందన్న ఆయన.. కాంగ్రెస్ నేతలు ఊరూరా తిరుగుతూ భయపడకండి అని చెబుతుంటారని ఎద్దేవా చేశారు. టీఎంసీ, వామపక్షాలు, కాంగ్రెస్ లకు అభివృద్ధి దృక్పథం లేదంటూ ప్రధాని ఆరోపించారు. 'నేను నా కోసం జీవించాలని కోరుకోవడం లేదు. సేవ చేయాలనే సంకల్పంతో 140 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికే వచ్చాను. దేశ ప్రజలు నన్ను ఎంతగానే ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదాలు మరింతగా పెరగాలి. స్వావలంబన భారత్ గా మార్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నా. మీ కలల కోసం దృఢ సంకల్పంతో జీవిస్తున్నా.'  అంటూ భావోద్వేగంగా ప్రధాని ప్రసంగం సాగింది.


Also Read: Bengal Governer Case : దుమారం రేపుతున్న బెంగాల్ గవర్నర్‌పై లైంగిక వేదింపుల కేసు - రాజ్‌భవన్‌లోకి పోలీసులు రాకుండా నిషేధం