Sexual Harassment Complaint Against West Bengal Governor :  పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ పై నమోదైన లైంగిక వేధింపుల కేసు పెను సంచలనంగా మారింది.  గవర్నరు తనను లైంగికంగా వేధించినట్లు రాజ్‌భవన్‌లో పని చేస్తున్న ఉద్యోగిని రాజ్ భవన్ లో ఉండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆ ఫిర్యాదును పోలీసులు   హేర్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. 


బాధిత మహిళ 2019 నుంచి రాజ్‌భవన్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేస్తున్నారు.   రెండు సందర్భాల్లో గవర్నర్‌ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఏప్రిల్   నెల 24న గవర్నర్‌ ముందుకు వెళ్ళినప్పుడు లైంగికంగా వేధించారని, మళ్లీ గురువారం కూడా ఇదే పరిస్థితులు ఎదురుకావడంతో ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల్ని ఆశ్రయించానని తెలిపారు. ఈ వ్యవహారంపై బెంగాల్ లో రాజకీయ దుమారం రేగుతోంది. 


రాజ్ భవన్‌లో పోలీసుల ఎంట్రీని గవర్నర్ నిషేధించారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 361 ప్రకారం క్రిమినల్‌ ప్రొసీడింగ్‌ల నుంచి గవర్నర్‌కు మినహాయింపు ఉంది. అందుకే రాజ్ భవన్ లోకి పోలీసుల రాకను అనుమతించడం లేదు.  ఈ అంశంపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. 


తనపై వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణలనుగవర్నర్ సీవీ ఆనంద బోస్ తీవ్రంగా ఖండించారు.అవన్నీ కల్పిత కథనాలు అన్నారు.  కల్పిత కథనాల్ని చూసి తాను భయపడనన్నారు.  చివరికి సత్యమే గెలుస్తుందని తెలిపారు.  ఈ  ప్రయత్నం ద్వారా ఎవరైనా రాజకీయంగా ప్రయత్నం పొందాలనుకుంటే వారిష్టమన్నారు.  రాష్ట్రంలో అవినీతి,  హింసపై తన పోరాటాన్ని ఎవనరూ ఆపలేరని  ప్రకటించారు. మాజీ బ్యూరోక్రాట్‌ అయిన బోస్‌ గత ఏడాది నవంబర్‌లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు.  





 


గవర్నర్ గా నియమితలైనప్పటి నుండి ఆయన బెంగాల్ ప్రభుత్వంలో ఘర్షణాత్మక వైఖరితోనే ఉన్నారు. ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య తీవ్ర  విబేధాలు ఉన్నాయి. బెంగాల్ లో సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ లైంగిక వేధింపుల కేసు విషయంలో గవర్నర్ చాలా దూకుడుగా స్పందించారు. ప్రభుత్వం సహకరించపోయినా సందేశ్‌ఖలీ వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వంపై రాజకీయ పరమైన విమర్శలు చేయడంలో ముందుంటారు.  


ఈ కేసు విషయంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది.  ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరింది. ఓ వైపు గవర్నర్ తప్పుడు ఫిర్యాదు అని ఆరోపిస్తున్నారు..మరోవైపు ఆయన తనకు రాజ్యాంగపరంగా ఉన్న ఇమ్యూనిటీని ఉపయోగించుకున్నారు. బాధితులు కేసు పెట్టి న్యాయం కోసం చూస్తున్నారు. ఈ అన్ని అంశాలతో రాజకీయంగా బెంగాల్ లో పెను దుమారం రేపుతోంది. 


ఎన్నికల ప్రచారంలో భాగంగాప్రధాని మోదీ శనివారం బెంగాల్ లో పర్యటించనున్నారు. అక్కడి ఎన్నికల్లో సందేశ్ ఖాలీ లైంగిక వేధింపుల కేసు హైలెట్ అవుతోంది. ఇలాంటి క్రమంలో గవర్నర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం పెను సంచలనంగా మారింది.