PM Modi Swachhata Hi Seva: 


 
స్వచ్ఛతా హీ సేవా..


అక్టోబర్ 2న మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ (అక్టోబర్ 1) స్వచ్ఛతా హీ సేవ (Swachhata Hi Seva) కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చింది. గంట పాటు అందరూ శ్రమదానం చేసి తమ పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర మంత్రులతో పాటు పలు చోట్ల సాధారణ పౌరులూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఇందులో భాగస్వాములయ్యారు. దాదాపు గంటపాటు శ్రమదానం చేశారు. హరియాణాకు చెందిన సోషల్ మీడియా ఫిట్నెస్ ఇన్ ఫ్లుయెన్సర్ అంకిత్ భయాన్ పురియాతో (Ankit Baiyanpuriya) కలిసి మోదీ చీపురుతో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఫిట్నెస్ పైనా అంకిత్ ను మోదీ అనేక ప్రశ్నలు అడిగారు. ఈ వీడియోని తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. దేశమంతా శ్రమదానం చేస్తున్న క్రమంలో తానూ ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొన్నట్టు ట్వీట్ చేశారు. అంకిత్ భయాన్ పురియాతో ఫిట్‌నెస్ గురించి చాలా సేపు చర్చించినట్టు వెల్లడించారు. 


"ఇవాళ దేశ ప్రజలంతా పరిసరాలు శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. నేనూ అదే పని చేశాను. నాతో పాటు అంకిత్ భయనా పురియా కూడా చేతులు కలిపారు. కేవలం పరిశుభ్రత గురించే కాకుండా ఫిట్‌నెస్ గురించి కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాం. స్వచ్ఛతతోనే స్వస్థత సాధ్యమవుతుంది"


- ప్రధాని నరేంద్ర మోదీ






ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పరిసరాలు శుభ్రం చేశారు. ఇటీవలే మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో అక్టోబర్ 1వ తేదీన అందరూ స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీకి స్వచ్ఛాంజలి ఘటిద్దాం అని చెప్పారు.