Tamilnadu Bus Accident : తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఊటీ విహారయాత్ర ముగించుకుని తిరిగి వెళ్తున్న ఓ టూరిస్ట్​ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు సహా ఓ మైనర్​ ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది.


పోలీసులు వివరాల మేరకు.. తెంకాసి జిల్లా కడయం ప్రాంతానికి చెందిన పర్యటకులు టూరిస్ట్ బస్సులో ఊటీ విహారయాత్రకు వెళ్లారు. శనివారం వారి యాత్ర పూర్తయ్యింది. సంతోషంగా స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో బస్సు కూనూర్​లోని మలపాలం వద్ద ఘాట్‌ రోడ్డులోకి చేరుకుంది. ఆ సమయంలో బస్సు డ్రైవర్​ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు ఒక్కసారిగా లోయలోకి దూసుకెళ్లింది. అంచులను ఢీకొడుతూ పల్టీలు కొట్టంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు, ఓ మైనర్​ సహా 9 మంది మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి. 


ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లోయ ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అతి కష్టం మీద సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. పోస్టుమార్టానికి తరలించారు. క్షతగాత్రులను సమీపంలోని కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు. బాధితుల హాహాకారాలు, రోదనలతో ఆస్ప్రతి వాతావరణం భయానకంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ఉన్నట్లు సమాచారం. 






మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్​గ్రేషియా..
ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌​గ్రేషియా ప్రకటించారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌​గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు పర్యటక శాఖ మంత్రి రామచంద్రన్‌​ను నియమించినట్లు తెలిపారు. మరోవైపు ప్రమాదం గురించి సమాచారం తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం హైల్ప్​ లైన్​ 1077 ను ఏర్పాటు చేసింది. ప్రమాదంపై కేంద్రం స్పందించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు సాయం ప్రకటించింది.


గత నెలలో జరిగన ప్రమాదంలో ఆరుగురు మృతి
గత నెల సెప్టెంబర్ మొదటి వారంలో తమిళనాడు ఇలాంటి ప్రమాదమే జరిగింది. సేలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. సెప్టెంబర్ ఆరో తేది తెల్లవారుజామున 4 గంటల సమయంలో తమిళనాడులోని సేలం-ఈరోడ్ హైవేపై వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో ఎనిమిది మంది ఉన్నారు. ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. మృతులు సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతి, ఒక సంవత్సరం వయస్సు గల చిన్నారి ఉన్నారు.