Carpooling Banned: 



కార్‌పూలింగ్ బ్యాన్..


ట్రాఫిక్‌ని తగ్గించడానికి కార్‌పూలింగ్ ఆప్షన్‌ని ఎంచుకోవాలంటూ అన్ని ప్రభుత్వాలూ సూచిస్తున్నాయి. ఒకే ఆఫీస్‌కి వెళ్లే ఉద్యోగులంతా ఒకే కార్‌లో వెళ్లాలని చెబుతున్నాయి. ఈ మేరకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ బెంగళూరులో మాత్రం కార్‌పూలింగ్‌ని (Carpooling in Bengaluru) బ్యాన్ చేశారు. కార్‌పూలింగ్ చేసిన వాళ్లకి రూ.10 వేల జరిమానా కూడా విధిస్తున్నారు. ఇదేం వింత నిర్ణయం అనుకుంటున్నారు కదా. ఇందుకు ఓ కారణముంది. క్యాబ్స్ అసోసియేషన్‌ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కి కంప్లెయింట్ ఇచ్చిందట. క్యాబ్‌లుగా రిజిస్టర్ చేసుకోని వాళ్లు తమ కార్లను కమర్షియల్‌గా వాడుతున్నారు. కార్‌పూలింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా క్యాబ్‌లుగా రిజిస్టర్ చేసుకున్న వాళ్లు నష్టపోతున్నారు. అందుకే వైట్‌ నంబర్ ప్లేట్‌ ఉన్న కార్‌లను కమర్షియల్ పర్పస్‌కి వినియోగించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది రవాణా శాఖ. ఈ నిబంధన ఉల్లంఘిస్తే రూ.10 వేల జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. కార్‌పూలింగ్‌ కోసం కొన్ని ప్రత్యేక యాప్స్‌ ఉన్నాయి. అందులో రిజిస్టర్ చేసుకుంటే ఎవరైనా కార్‌పూలింగ్ చేయొచ్చు. ఆ మేరకు డబ్బు సంపాదించుకోవచ్చు. అయితే..ఇకపై వైట్ నంబర్ ప్లేట్‌ ఉన్న వాళ్లెవరైనా ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని రవాణాశాఖ స్పష్టం చేసింది. RCని ఆర్నెల్ల పాటు రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో పాటు రూ.5-10 వేల వరకూ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 


"కార్‌పూలింగ్ యాప్స్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రైవేట్ కార్స్‌ని కమర్షియల్‌గా వినియోగించేలా ప్రోత్సహిస్తున్నాయి. ట్యాక్సీ డ్రైవర్‌ల నుంచి మాకు  పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఇకపై ఇలా ఎవరు చేసినా కఠిన చర్యలు తప్పవు"


- రవాణాశాఖ అధికారులు 


హైదరాబాద్‌లో కార్‌పూలింగ్..!


ఇటు హైదరాబాద్‌లో మాత్రం ట్రాఫిక్‌ని తగ్గించేందుకు పోలీసులు కార్‌పూలింగ్‌ ఆప్షన్‌ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ముఖ్యంగా ఐటీ జోన్స్‌లో ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ గంటలకొద్దీ జామ్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో స్థోమత పెరిగిపోవడంతో చాలా మంది కార్లు తీసుకుంటున్నారు. ఆఫీసుకు వెళ్లాలన్నా, ఏదైనా పనిపై బయటకు వెళ్లినా కార్లను రోడ్లెక్కిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో.. బైకులు వాడే వారు కూడా కార్లు ఉంటే వాటిలోనే ఆఫీసులకు వెళ్తున్నారు. దీంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు అండర్ పాస్ లు, ఫ్లైఓవర్లు నిర్మించినా.. చాలా ప్రాంతాల్లో ఇంకా ట్రాఫిక్ సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ సమస్య ఐటీ కారిడార్ పరిధిలో మరీ ఎక్కువగా ఉంది. ఐటీ ఉద్యోగులు వరుసగా ఆఫీసులకు వస్తుండటంతో ట్రాఫిక్ పెరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు కార్ పూలింగ్ విధానం అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. టీసీఎస్, డెలాయిట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, జేపీ మోర్గాన్, విప్రో, ఐసీఐసీఐ, హెచ్ఎస్బీసీతో పాటు పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సీపీ స్టీఫెన్ భేటీ అయ్యారు. ఐటీ కారిడార్ లో కార్ పూలింగ్ విధానంపై ఐటీ కంపెనీల ప్రతినిధులు చర్చించారు. 


Also Read: నవంబర్ నాటికి భారత్‌కి శివాజీ పులిగోళ్ల ఆయుధం, త్వరలోనే లండన్‌కి మహారాష్ట్ర మంత్రి