Parliament Session News: విజన్ 2024 కోసం తాము 24x7 పని చేస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. తాము ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని పాలనలోనూ ప్రతి విధానంలోనూ పాటిస్తామని పునరుద్ఘాటించారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సమయంలో విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ నిరసనల మధ్యే మోదీ ప్రసంగం కొనసాగింది. 


‘‘మా పాలనలో పట్టణాలు, గ్రామాల రూపురేఖలు మారాయి. దేశ ప్రజలంతా మావైపే ఉన్నారు. పదేళ్ల మా పాలన చూసి ప్రజలు మరోసారి తీర్పు ఇచ్చారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదలను దారిద్ర్యరేఖ నుంచి బయటకు తెచ్చాం. పదేళ్లలో పూర్తిగా అవినీతి రహిత పాలన అందించాం. అందుకే ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. ప్రపంచ పటంలో భారత్ ప్రతిష్ఠ, గౌరవం పెరిగింది. భారత్ ప్రథమ్ అనే మా నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. మేం కార్యక్రమం చేపట్టినా భారత్ ప్రథమ్ కేంద్రంగానే పని చేస్తాం. 


మా ప్రభుత్వ పథకాలు మారుమూల ప్రజలకూ చేరుతున్నాయి. 140 కోట్ల మంది ప్రజలకు సేవ చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం. వికసిత్ భారత్ దిశగా మా సంకల్పంలో ఎలాంటి మార్పు లేదు.దేశం పురోగతి చెందితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. తద్వారా భావితరాలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. 


వారి నొప్పి నేను అర్థం చేసుకుంటాను. అబద్ధాలు వ్యాప్తి చేస్తూ వరుసగా విపక్ష పార్టీ అవమానకర రీతిలో ఓడిపోతూనే ఉంది’’ అని మోదీ మాట్లాడారు.