PM Modi Speech Highlights : రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న రాజ్ పథ్ మార్గాన్ని ఆధునీకరించి 'కర్తవ్య పథ్'గా మార్చారు. ఈ కర్తవ్యపథ్ ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ప్రారంభించారు.  న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 28 అడుగుల విగ్రహాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ మెగా ఈవెంట్‌కు కేంద్ర మంత్రులతో సహా భారతీయ జనతా పార్టీ (BJP) పెద్దలు హాజరయ్యారు. గురువారం సాయంత్రం 7 గంటలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని అక్కడికి చేరుకున్నారు.






నేతాజీ విగ్రహం ఆవిష్కరణ 


 కర్తవ్యపథ్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. "వలసవాదానికి చిహ్నం రాజ్ పథ్ ఒక చరిత్రగా నిలిచిపోతుంది. దానిని శాశ్వతంగా తుడిచివేసి కర్తవ్యపథం రూపంలో కొత్త శకం ప్రారంభమైంది. వలసవాదానికి చిహ్నంగా ఉన్న దేశ ప్రజలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను" అని ప్రధాని మోదీ అన్నారు. గత 8 సంవత్సరాలలో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తుచేసుకునేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అండమాన్ & నికోబార్ దీవులలో జాతీయ జెండాను ఆవిష్కరించి 'అఖండ భారత్' మొదటి అధిపతి నేతాజీ అని ఆయన చెప్పారు. ఇవాళ ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ ప్రతినిధి విగ్రహం ఇక్కడ ఉండేదని, ఇప్పుడు నేతాజీ విగ్రహ స్థాపనతో సాధికారత కలిగిన భారతదేశం కోసం తాము కొత్త మార్గాన్ని ఏర్పాటు చేశామన్నారు.  






శ్రమజీవులు 


"భారతీయులను బానిసలుగా చూసిన బ్రిటిష్ వారి వలసవాదానికి చిహ్నం రాజ్ పథ్. ఇప్పుడు దాని నిర్మాణం మారిపోయింది. దాని స్ఫూర్తి కూడా మారిపోయింది" అని ప్రధాని మోదీ అన్నారు. కర్తవ్యపథ్ ప్రారంభోత్సవానికి ముందు, సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ నిర్మాణ కార్మికులతో ప్రధాని మోదీ సంభాషించారు. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో పనిచేసిన వారందరినీ ఆహ్వానిస్తానని, వారిని శ్రమజీవులుగా ప్రధాని ఉటంకించారు.  సెంట్రల్ విస్టా అవెన్యూలో ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధానమంత్రి తిలకించారు. కర్తవ్యపథ్ ను గతంలో రాజ్‌పథ్‌గా పిలిచేవారు. కర్తవ్యపథ్ చుట్టూ పచ్చదనంతో  కూడిన నడక మార్గాలు, పునరుద్ధరించిన కాలువలు ఉన్నాయి. ఆహార దుకాణాలు, కొత్త సౌకర్యాల బ్లాక్‌లు, వెండింగ్ కియోస్క్‌లు ఉన్నాయి.  రాజ్‌పథ్ అధికార చిహ్నంగా ఉంది. కర్తవ్యపథ్  ప్రజాస్వామ్యం, సాధికారతకు ఉదాహరణగా సూచిస్తుంది.  


Also Read : CM Mamata Banerjee: '2024 ఎన్నికల్లో మోదీపై సమష్టిగా పోరాడతాం- నితీశ్‌తో కలిసే'


Also Read : Prashant Kishor: ఆ ఫోటోలు పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసిన పీకే, ఏం జరిగింది?