PM Modi Target: టార్గెట్ @ 400. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు(General Elections) సంబంధించి పార్ల‌మెంటు వేదిక‌గా  ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Narendra Modi)  రెండు రోజుల కింద‌ట చేసిన ప్ర‌క‌ట‌న‌. త‌మ‌కు ఒంట‌రిగా  అంటే.. బీజేపీ(BJP)కి 370 స్థానాల్లో విజ‌యం ద‌క్కుతుంద‌ని.. ఎన్డీయే మిత్ర‌ప‌క్షాల‌తో క‌లుపుకొంటే.. త‌మ‌కు 400 సీట్ల‌పైమాటే ద‌క్కినా ఆశ్చ‌ర్యం లేద‌ని ఆయ‌న ప్ర‌క‌ట‌న చేశారు. అయితే.. వ‌రుస‌గా రెండు సార్లు కేంద్రంలో పాల‌న చేసిన పార్టీ.. పైగా పెట్రోలు, ఇత‌ర నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలో నాణేనికి ఒక వైపు చూసుకున్న‌ప్పుడు అస‌లు గెలుపు సాధ్య‌మా? అనే సందేహాలు వ్య‌క్తం కావ‌డం స‌హజం. అదేస‌మ‌యంలో ఇంత ధీమా వ్య‌క్త ప‌రుస్తున్న ప్ర‌ధాని వ్యూహం ఏంట‌నేది కూడా చ‌ర్చ‌నీయాంశం. అదే నాణేనికి రెండోవైపు!!


రాజ‌కీయంగా.. 


రాజ‌కీయంగా చూసుకుంటే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో(Nothren States) బీజేపీ బ‌ల‌మైన స్థానంలో ఉంది. ఢిల్లీ, పంజాబ్‌, ప‌శ్చిమ బెంగాల్ మిన‌హా.. ఇత‌ర రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలో ఉంది. ఇక‌, మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన నేతృత్వంలో ని మ‌హా అఘాడీ వికాస్‌ను కూల్చేసి.. బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివ‌సేన+ బీజేపీ క‌లిసి ఇక్క‌డ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సో.. ఎలా చూసుకున్నా.. మ‌హారాష్ట్ర‌లోనూ బీజేపీ దూకుడు పెరిగింది. గుజ‌రాత్‌, యూపీ, బిహార్‌(మిత్ర‌ప‌క్షం), రాజ‌స్తాన్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్, ఉత్త‌రాఖండ్ స‌హా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌రాది సీట్ల‌లో బీజేపీ త‌న ప్ర‌భావం ఎక్క‌డా త‌గ్గించుకునే అవ‌కా శం లేక‌పోగా.. ఈ ద‌ఫా.. త‌మ రాష్ట్రంలోని 80కి 80 పార్ల‌మెంటు స్థానాల‌ను కూడా ద‌క్కించుకుని తీరుతామ ని యూపీ(UP) సీఎం యోగి ఆదిత్య నాథ్(Yogi aditya nath) రెండు రోజుల కింద‌ట ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే ప్ర‌క‌టిం చారు. ఇక‌, మ‌హారాష్ట్ర‌లో షిండే నేతృత్వంలోని శివ‌సేన‌కు వ‌చ్చే సీట్లు, బీజేపీకి వ‌చ్చే సీట్లు కూడా బీజేపీకి ద‌క్కేవిగా నే చూడాలి. బిహార్‌లోనూ ఇంతే. ఇక‌, ఎటొచ్చీ.. ద‌క్షిణాది రాష్ట్రాల‌ను గ‌మ‌నిస్తే.. ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రా ల్లో మాత్ర‌మే బీజేపీ ఉనికిలో లేక‌పోయినా.. ఏపీ నుంచి ఎవ‌రు విజ‌యం ద‌క్కించుకున్నా.. వారు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మ‌ద్ద‌తు తెల‌ప‌డం ఖాయం. సో.. ఎటు చూసినా.. బీజేపీకి  ఇబ్బంది లేకుండా పోయింది. ఇది రాజ‌కీయంగా క‌లిసి వ‌స్తున్న వ్య‌వ‌హారం. 


సంక్షేమం ప‌థ‌కాలు.. 


ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ టార్గెట్ @ 400 వెనుక‌.. సంక్షేమం, ప‌థ‌కాలు కూడా కీల‌కంగా మారాయి. ముఖ్యంగా ఉజ్వ‌ల యోజ‌న‌, ప్ర‌తి ఇంటికీ మ‌రుగుదొడ్డి, జ‌న్ ధ‌న్ యోజ‌న స‌హా.. ప్ర‌స్తుతం నిర్వ‌హిస్తున్న విక‌సిత భార‌త్ సంక‌ల్ప యాత్ర‌ల ద్వారా ఆయా ప‌థ‌కాల్లోకి విరివిగా ల‌బ్ధి దారుల‌ను చేర్చుతున్న వైనానికి ఓటు బ్యాంకు క‌లిసి వ‌స్తుంద‌ని క‌మ‌ల నాధులు ఆశ‌లు భారీగానే పెట్టుకున్నారు. మ‌రోవైపు పీఎం ఆవాస్ స‌హా.. సౌర ఫ‌ల‌కాల ఏర్పాటు వంటివి తాజాగా ప్ర‌క‌టించిన బ‌డ్జెట్ అంశాలు కూడా మోదీ వ్యూహానికి మ‌రింత ప‌దును పెట్ట‌నున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు.. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో పోటీ ప‌డేలా చేస్తున్నామ‌ని.. ఐదు అగ్ర‌స్థానాల్లో ప్ర‌స్తుతం ఉన్న స్థాయి నుంచి మ‌రింత మెరుగైన స్థాయికి తీసుకువెళ్తామ‌ని ప్ర‌ధాని చెబుతున్న మాట‌ల‌ను ఆర్థిక రంగ నిపుణులు సైతం స్వాగ‌తిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. అటు రాజ‌కీయంగా.. ఇటు సంక్షేమం ప‌రంగా కూడా.. మోదీ వ్యూహాలు 400 ల‌క్ష్య సాధ‌న దిశ‌గా అడుగులు వేస్తున్నాయ‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న విష‌యం. 


`ర‌త్న శోభితం` మోదీకే!


ఈ ఏడాది కేవ‌లం 40 రోజుల్లోనే ఏకంగా ఐదు భార‌త‌ర త్న అవార్డుల‌ను ప్ర‌ధాన మంత్రి మోదీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఉత్త‌రాది నుంచి ద‌క్షిణాది వ‌ర‌కు.. ఈ ర‌త్నాలు పొందిన వారిలో ఉన్నారు. తొలుత బిహార్ పూర్వ ముఖ్య‌మంత్రి, దివంగ‌త  క‌ర్పూరీ ఠాకూర్ కు, త‌ర్వాత‌.. లోహ పురుష్‌.. లాల్ కృష్ణ అద్వానీకి ప్ర‌క‌టించారు. ఈ రెండు ప్ర‌క‌ట‌న‌ల్లోనూ రాజ‌కీయం దొంత‌ర‌లు చాలానే ఉన్నాయి. బిహార్‌లో కుల‌గ‌ణ‌నకు చెక్ పెట్టేలా.. బీసీ సామాజిక వ‌ర్గాన్ని బీజేపీవైపు తిప్పుకొనేలా క‌ర్పూరీ ఠాకూర్‌కు భార‌త‌రత్న ప్ర‌క‌టించార‌నే వాద‌న‌ను తోసిపుచ్చ‌లేం. ఇక‌, అద్వానీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించ‌డం వెనుక‌.. ఖ‌చ్చితంగా బీజేపీలోను, ఆర్ ఎస్ ఎస్‌లోనూ త‌న‌కు తిరుగులేని ఆధిప‌త్యం దిశ‌గా మోదీ అడుగులు వేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక‌, ఇప్పుడు తెలుగు వాడైన‌ పీవీ న‌ర‌సింహారావుకు భార‌త ర‌త్న ఇవ్వ‌డం ద్వారా.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ పుంజుకుంటుందా.. లేదా.. అనేది ప‌క్క‌న పెడితే.. మోదీపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించ‌గ‌ల‌ర‌నేది వాస్త‌వం. ఇక‌, చౌద‌రి చ‌ర‌ణ్ సింగ్‌, స్వామినాథ‌న్‌ల‌కు భార‌తర‌త్న‌లు ప్ర‌క‌టించ‌డం ద్వారా.. మోదీ స‌మ‌గ్ర వ్యూహం నింగినంటింద‌నే చెప్పాలి. సో.. ఈ ర‌త్న శోభిత కాంతుల్లో మోదీ ప్ర‌భ 400ల‌కు పెరిగినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.