PM Modi Diwali With Soldiers: దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) సంబరాలను ప్రజలు  ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నా, పెద్దా అందరూ కలిసి వేడుకలు చేసుకుంటున్నారు. పలుచోట్ల వీధుల్లో నరకాసురుని వధ నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లోని లేప్చాలో భారత సైన్యంతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు. సైనిక బలగాలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. 


సైనికులపై ప్రశంసలు


అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్‌ వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. సైనిక బలగాలు ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని విజయాలు సాధించాయని ప్రశంసలు కురిపించారు. పండుగ వేళ కుటుంబానికి దూరంగా, సరిహద్దుల్లో విధులు నిర్వహించడం త్యాగనీయమని కొనియాడారు. భారత భద్రతా బలగాలు పని చేస్తున్న చోటు తనకు దేవాలయంతో సమానమన్న మోదీ, ధైర్య సాహసాలు కలిగిన సైనికులు హిమాలయాల్లా సరిహద్దుల్లో ఉన్నంత వరకూ దేశమంతా సురక్షితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. సైనిక బలగాలు క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని విజయాలు సాధించాయని అన్నారు.


కీలక ఆపరేషన్లు విజయవంతం


వివిధ దేశాల్లో భద్రతా బలగాలు నిర్వహించిన కీలక రెస్క్యూ ఆపరేషన్లను ప్రధాని మోదీ, ఈ సందర్బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. సూడాన్‌ నుంచి భారతీయులను తీసుకువచ్చే మిషన్‌ను సైన్యం  విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. ఆ తర్వాత టర్కీలో భూకంపం సంభవించినప్పుడు భారత బలగాలు ఎంతో ధైర్యసాహసాలతో సహాయక చర్యలు చేపట్టాయన్నారు. సైన్యాన్ని చూసి దేశం గర్విస్తోందన్నారు. ఏటా సరిహద్దుల్లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు ప్రధాని మోదీ. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సైనికులతోనే దీపావళి చేసుకొని స్వీట్లు పంచిపెడుతున్నారు. 2014లో మోడీ తొలిసారి సియాచిన్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.


2022లో కార్గిల్‌లో సంబరాలు


గతేడాది ప్రధాని మోదీ కార్గిల్‌లో సైనికులతో కలిసి దీపావళి జరుపుకొన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఆర్మీ ప్రింట్ జాకెట్, టోపీ ధరించి సందడి చేశారు. 2021లో జమ్మూ కాశ్మీర్‌లోని నౌషేరాలో దీపావళి చేసుకున్నారు. 2020లో ప్రధాని రాజస్థాన్‌లోని లాంగేవాలా సరిహద్దు పోస్ట్‌ను సందర్శించారు. ఆ సమయంలో ట్యాంక్ రైడ్ చేశారు. అనంతరం సైనికులకు మిఠాయిలు పంచారు. ఇక జైసల్మేర్ ఎయిర్ బేస్ వద్ద దేశంలోని వీర సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. 


మరోవైపు, దేశమంతా దీపావళి వేడుకులు ప్రజలు ఘనంగా చేసుకుంటున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా బాణాసంచా కాలుస్తూ కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేస్తున్నారు.