PM Modi Cabinet Decisions: జాతీయంగా ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రవేశపెట్టిన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఆధారాల ఫోరెన్సిక్ దర్యాప్తు సకాలంలో చేసే వీలుంటుంది. ఈ పథకంలో భాగంగా ఫోరెన్సిక్ క్యాంపస్‌లు, ల్యాబ్‌లు, ఇతర ఫోరెన్సిక్ సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2254.43 కోట్లను కేటాయించింది. ఈ నేషనల్ ఫోరెన్సిక్ పథకంలో ఏడాదికి 9 వేల వరకూ ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుజరాత్ లోని గాంధీనగర్‌లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ శాఖలను అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నెలకొల్పనున్నారు.


కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ చట్టాలకు వివిధ నేరాల్లో ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ మరింత మెరుగ్గా జరగాలని కేబినెట్ భావించింది. ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్ష పడే నేరాల విషయంలో ఫోరెన్సిక్ దర్యాప్తును తప్పనిసరి చేసినందున ఇప్పటికి ఉన్న ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలు చాలవని కేబినెట్ సభ్యులు అంచనా వేశారు. అందుకే దేశంలో ఫోరెన్సిక్ సదుపాయాల కల్పనకు రూ.2254.43 ప్రభుత్వం కేటాయించింది.


14 పంటలకు కనీస మద్దతు ధర
బుధవారం (జూన్ 19) ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయం గురించి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. వరి, రాగులు, మినుము, జొన్న, మొక్కజొన్న, పత్తితో సహా ఖరీఫ్ సీజన్‌లో 14 పంటలకు కనీస మద్దతు ధరకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. వరి ధాన్యం విషయంలో కొత్త ఎంఎస్పీ రూ.2300, అంటే రూ.117 పెరిగిందని.. 2013-14లో ధర రూ.1310 మాత్రమే ఉండేదని అన్నారు.


ఏ పంటలకు ఎంత ఎంఎస్పీ?


పత్తికి రూ.7121 (501 పెరిగింది)
రాగి – 4290
మొక్కజొన్న – రూ.2225
పెసర్లు – 8682
కందులు – 7550
మినపప్పు – 7400
వేరుశనగ నూనె – రూ.6783


మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం


పోర్టులు, షిప్పింగ్ రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా అశ్విని వైష్ణవ్ తెలిపారు. మహారాష్ట్రలోని విధావన్‌ దగ్గర గ్రీన్‌ ఫీల్డ్‌ డీప్‌ డ్రాఫ్ట్‌ పోర్టును రూ.76,200 కోట్లతో అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లుగ అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. ఇది కనుక పూర్తి అయితే ప్రపంచంలోనే టాప్‌ టెన్ పోర్టుల్లో ఒకటిగా నిలవనుంది. ఈ పోర్టు నిర్మాణం జరిగి అందుబాటులోకి వస్తే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.


విద్యుత్ ప్రాజెక్టులకూ ఆమోదం


తమిళనాడు, గుజరాత్‌లో రూ.7,453 కోట్లతో 500 మెగావాట్ల సామర్థ్యంతో చెరొక ఆఫ్‌షోర్‌ పవన విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే, వారణాసిలో ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని చప్పారు. ఇక్కడ రూ.2,869.65 కోట్లతో కొత్త టెర్మినల్‌ భవనం నిర్మాణంతో పాటు రన్‌ వేల విస్తరణ ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు అశ్వనీ వైష్ణవ్ వెల్లడిచారు.