Prajwal Revanna: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్ సెక్యూలర్ (జేడీఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్ తగిలింది.  సిట్టింగ్, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులను విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు ఐదు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులను విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి జూన్ 12 న ఆయనను బెంగళూరు ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుంది. 


కోర్టుకు ప్రజ్వల్ ఫిర్యాదు
మంగళవారం కస్టడీ ముగిసిన తర్వాత ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కెఎన్ శివకుమార్ ముందు హాజరుపరిచారు. సిట్ అభ్యర్థన మేరకు ప్రజ్వల్ ను జూలై 2 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. సిట్ అధికారులు తన పట్ల, తన ఆరోగ్య సమస్యలపై సరైన శ్రద్ధ చూపడం లేదని ప్రజ్వల్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ప్రజ్వల్‌ను మరో కేసుకు సంబంధించి మళ్లీ పోలీసులు విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకున్నారు. మూడో కేసును విచారించేందుకు ప్రజ్వల్ రేవణ్ణను జూన్ 24 వరకు సిట్ కస్టడీకి కోర్టు అప్పగించింది.


రెండు కేసుల్లో విచారణ పూర్తి
ప్రజ్వల్ ను కస్టడీకి తీసుకున్న  పోలీసులు తనను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు.  నిపుణుల వైద్య పరీక్షల ప్రక్రియ తనకు ఇబ్బంది కలిగిస్తోందని మంగళవారం (జూన్ 18న) ప్రజ్వల్ రేవణ్ణ కోర్టుకు తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణ మూడు లైంగిక వేధింపుల కేసుల్లో నిందితుడిగా ఉండగా, రెండు కేసుల్లో సిట్ కస్టడీ విచారణను పూర్తి చేసింది. పోలీసు కస్టడీలో ఆరు రోజుల విచారణ పూర్తి కావడంతో రెండో కేసులో (పనిమనిషిపై లైంగిక దాడి) మంగళవారం మాజీ ఎంపీకి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ప్రజ్వల్ రేవణ్ణ మొదటి కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు (వంట మనిషిపై లైంగిక వేధింపులు). ఈ కేసులో సిట్ విచారణ పూర్తి చేసింది. వందల సంఖ్యలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు బయటకు రావడంతో రేవణ్ణ భారత్ నుంచి జర్మనీకి పారిపోయారు. డిప్లామాట్ పాస్‌పోర్టుపై ఆయన జర్మనీకి వెళ్లారు.


భవానీ రేవణ్ణకు బెయిల్ 
మహిళను కిడ్నాప్‌ చేసిన కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతవారం బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణ ఎస్‌ దీక్షిత్‌ తీర్పును వాయిదా వేశారు.  హైకోర్టు భవానీకి షరతులో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. విచారణకు భవానీ సహకరించడం లేదని, దీంతో విచారణ ముందుకు వెళ్లడం లేదని, సిట్‌ ప్రశ్నలకు సహేతుకమైన సమాధానాలు ఆమె నుంచి రావడం లేదని, అందుకు వల్ల భవానీకి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. సిట్‌ పిలిచినప్పుడు తప్పని సరిగా విచారణకు హాజరు కావాలని భవానీకి సూచించారు.