Ayodhya Railway Station:
రైల్వే స్టేషన్ ప్రారంభం..
అయోధ్య రైల్వే స్టేషన్‌ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న స్టేషన్‌కి కొత్త హంగులు అద్ది మరింత అందంగా తీర్చి దిద్దారు. దీనికి అయోధ్య ధామ్ జంక్షన్ (Ayodhya Dham Junction) అని పేరు పెట్టారు. ఈ రెనోవేషన్ కోసం ప్రభుత్వం రూ.240 కోట్లు ఖర్చు చేసింది. లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లు, వెయిటింగ్ హాల్స్, క్లాక్‌రూమ్స్‌తో పాటు ఫుడ్ ప్లాజాలు ఏర్పాటు చేసింది. రామ మందిర ఆకృతిలోనే స్టేషన్‌ని తీర్చి దిద్దారు. ఆ తరవాత యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసిస్టేషన్‌ని పరిశీలించారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీకి ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఆయనతో పాటు రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కూడా ఉన్నారు. రైల్వే స్టేషన్‌కి చేరుకునే క్రమంలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో నిర్వహించారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని దారి పొడవునా ఆయనకు అభివాదం చేశారు.
ఇదే స్టేషన్‌లో ఆరు వందేభారత్ రైళ్లతో పాటు, రెండు అమృత్ భారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. పుష్‌పుల్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ రైళ్లు ఇప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రైల్వే స్టేషన్‌ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. వందేభారత్ రైల్‌ని ప్రారంభించిన తరవాత ఆ ట్రైన్‌లో ఎక్కారు ప్రధాని మోదీ. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.
ఈ స్టేషన్‌లో ఇంకెన్నో ప్రత్యేకతలున్నాయి. అందరికీ అందుబాటులో ఉండే ఈ స్టేషన్‌కి Indian Green Building Council (IGBC) సర్టిఫికేట్ లభించింది. అంతే కాదు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా Infant Rooms అందుబాటులో ఉన్నాయి. సిక్‌రూమ్ కూడా నిర్మించారు. టూరిస్ట్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్‌నీ ఏర్పాటు చేశారు. స్టేషన్ టాప్ ఫ్లోర్‌ని రాముని విల్లు ఆకారంలో నిర్మించారు. అంతే కాదు. ఇందులో ఎయిర్ పోర్ట్ తరహా వసతులు కల్పించారు. ట్యాక్సీ బే కూడా ఉంది.